Idream media
Idream media
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి రానుందా..? నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోందా..? అంటే సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి.
‘‘కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు మళ్లీ ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇందుకు పరిష్కారం కోవిడ్ వ్యాక్సిన్ వేయడమే. ఆరు రోజుల్లో ముగిసే పరిషత్ ఎన్నికల ప్రక్రియ తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి అంతా కేంద్రీకరించాలి. ప్రజలకు వ్యాక్సిన్ వేయడమే మనముందున్న కర్తవ్యం’’ అంటూ సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష సందర్భంగా స్పష్టం చేశారు.
సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలతోనే.. పరిషత్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి రాబోతోందని తెలుస్తోంది. ఈ రోజు ఎస్‌ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీ విమరణ చేశారు. నూతన ఎస్‌ఈసీగా ఇప్పటికే నీలం సాహ్ని నియామకం పూర్తయింది. రేపు ఏప్రిల్ 1వ తేదీన ఆమె ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సృష్టించిన కోర్టు వివాదాలు కూడా పరిష్కారమయ్యాయి. కాబట్టి మధ్యలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడానికి ఎలాంటి సమస్యలు లేవు.
రేపు నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ ప్రచారం వద్ద వాయిదా పడింది. ప్రచారం, పోలింగ్, ఫలితాల ప్రక్రియ మిగిలి ఉంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే సరిపోతుంది.
Also Read : మార్ఫింగ్ ఫొటోలే కాదు.. వీడియోలు కూడా ఉంటాయా..? – పనబాక లక్ష్మీ
ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు వారికి వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరీ వ్యాక్సిన్ వేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రెండు వేలు, నాలుగు వేల జనాభాకు ఒకటి చొప్పన ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ వేయబోతున్నారు. సచివాలయాల్లో హెల్త్ అసిస్టెంట్ ఉండడం వల్ల టీకా వేసే ప్రక్రియ సాఫీగా సాగుతుంది. 45 ఏళ్లు పైబడిన వారి పేర్లను ఇప్పటికే వలంటీర్లు సేకరించారు.
ప్రజల్లో వ్యాక్సిన్ వేయించుకోవడంపై అనేక సందేహాలు, భయాందోళనలు ఉన్నాయి. అయితే ఈ సందేహాలు, భయాందోళనలను పటాపంచలు చేసేలా.. ప్రజలకు వ్యాక్సిన్‌పై భరోసా ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్.. రేపు గురువారం గుంటూరు నగరంలోని భరత్‌పేట వార్డు సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు.
సీఎం జగన్.. వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తారు. ఫలితంగా నెల రోజుల్లో కోటి మందికి టీకా వేయాలనే ప్రభుత్వ లక్ష్యం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది జరగాలంటే.. ముందు పరిషత్ ఎన్నికలు జరగాలి కాబట్టి.. జరుగుతున్న ప్రచారం మేరకు రేపు పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని భావించొచ్చు.
Also Read : ఆత్మనూన్యతాభావనలో నిమ్మగడ్డ.. పదవీ విరమణ సమయంలో సుద్దులు