iDreamPost
iDreamPost
గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేసిన నేతల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఆయన నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, జిల్లా వ్యాప్తంగా పరిచయాలుండడంతో ప్రతిపక్షంలో కూడా ఆయన సమర్థవంతంగా పనిచేశారు. టీడీపీ నేతల దూకుడుకి అడ్డుకట్ట వేయగలిగారు. అనేక సందర్భాల్లో జగన్ కి అండగా నిలిచి కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఆ క్రమంలోనే చిలకలూరిపేట నుంచి 2014 లో బరిలో దిగేందుకు అవకాశం వచ్చినప్పటికీ ఆయన పరాజయం పాలయ్యారు. అయినా 2019 ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ఆయన ఆసక్తి చూపినప్పటికీ చివరకు ఆ అవకాశం విడుదల రజనీకి దక్కింది. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన రజనీకి చాన్సిస్తూ మర్రి రాజశేఖర్ కి పెద్ద పదవి కట్టబెడతానని జగన్ హామీ ఇచ్చారు. బహిరంగసభ సాక్షిగా ప్రకటించారు. తన పక్కన కూర్చోబెట్టుకుంటానని తెలిపారు.
వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అంతా భావించారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్సీ జాబితా విడుదలవుతున్న ప్రతీ సందర్భంలోనూ ఆశావాహుల జాబితాలో మర్రి రాజశేఖర్ పేరు వినిపిస్తోంది. ఆయనకే అవకాశం అంటూ అంతా భావించారు. కానీ తీరా చూస్తే పలుమార్లు ఆశాభంగమయ్యింది. రాజశేఖర్ కూడా నిరుత్సాహపడ్డారు. అనుచరులు, సన్నిహితులు సైతం జగన్ తీరు మీద విమర్శలు చేశారు. నమ్మించి, అవకాశం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారనే అభిప్రాయం మర్రి వర్గీయుల్లో బలపడుతోంది.
సరిగ్గా ఈ సమయంలో మర్రి రాజశేఖర్ కి అనుకోని అవకాశం తలుపు తట్టబోతోంది. త్వరలో ఆయనకు పెద్దల సభలో పెద్ద పీట వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యసభకు ఆయన్ని పంపించాలనే నిర్ణయానికి వైఎస్సార్సీపీ అధినేత వచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రాథమికంగా మర్రి రాజశేఖర్ వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో ఈ అవకాశం ఖాయంగా భావిస్తున్నారు. వచ్చే జూన్ లో రాజ్యసభ ఖాళీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీ నుంచి మరోసారి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి సిట్టింగ్ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దాదాపు ఖాయం. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఆయన పేరుని మరోసారి ప్రతిపాదించడం అనివార్యం. దాంతో మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి కమ్మ కులానికి చెందిన నేతకు కట్టబెట్టేందుకు అంతా సిద్ధమయ్యింది. కమ్మ కోటాలో కూడా ఒకరిద్దరు పోటీ పడుతున్నప్పటికీ మర్రి రాజశేఖర్ కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
నిజానికి మర్రి రాజశేఖర్ కి మండలిలో అవకాశం ఇచ్చినా క్యాబినెట్ బెర్త్ కష్టంగా కనిపిస్తోంది. కమ్మ నుంచి కేవలం ఒక్కరికే మంత్రిమండలిలో చోటు ఉంటుంది. ఇప్పటికే ఆ అవకాశం కొడాలి నానికి దక్కింది. మరొకరికి అవకాశం ఇవ్వాలంంటే నానిని సాగనంపాల్సి ఉంటుంది. అది అంత సులువు కాదు. అదే సమయంలో గుంటూరు జిల్లా రాజకీయ సమీకరణాలు కూడా రాజశేఖర్ కి సానుకూలంగా కనిపించడం లేదు. జిల్లాలో ఎస్సీ , కాపు వర్గాలను కాదని మరొకరికి క్యాబినెట్ ఛాన్స్ కష్టమవుతుంది. ఈ తరుణంలో అన్నీ ఆలోచించిన జగన్ చివరకు మర్రి రాజశేఖర్ ని ఎంపీగా చేసి పెద్ద స్థానంలో నిలబెడతాననే తన మాట నిలపుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజ్యసభ పదవి ఆరేళ్ల పాటు ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీ హోదా కన్నా మిన్నగా మర్రి రాజశేఖర్ సైతం సంతోషంగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకుని రాజశేఖర్ పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించడం ఖాయంగా ఉంది. జగన్ దానికి సంబంధించి కసరత్తులు చేస్తున్నట్టు మీడియా వర్గాల్లో ప్రచారం మొదలయ్యింది.