iDreamPost
android-app
ios-app

మమత కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారా? తృతీయ కూటమికి అది విఘాతమేనా

  • Published Sep 29, 2021 | 11:39 AM Updated Updated Mar 11, 2022 | 10:41 PM
మమత కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారా?  తృతీయ కూటమికి అది విఘాతమేనా

మొన్నామధ్య మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితా దేవ్.. నిన్న గోవా మాజీ ముఖ్యమంత్రి లూజినో ఫెలీరో.. ఇద్దరూ కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లోనే చేరారు. తృణమూల్ ఇంతవరకు పశ్చిమ బెంగాల్ కే పరిమితమైన పార్టీ. కానీ అసోం, గోవాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు టీఎంసీలో ఎందుకు చేరుతున్నట్లు? కాంగ్రెస్‌తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ కాంగ్రెసు నుంచే ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు.. అలా చేయడం మూడో కూటమి ఏర్పాటు యత్నాలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది కదా.. అని సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మూడో కూటమి విషయం పక్కన పెడితే.. మమత దీదీ- సోనియా స్నేహం మున్నాళ్ల ముచ్చటగా మారింది. మమత చేసిన కొన్ని ప్రతిపాదనలకు గత నెల భేటీలో సోనియా అంగీకరించక పోవడం వల్లే మమత బెంగాల్‌లో బీజేపీని, రాష్ట్రం బయట కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్‌పై టీఎంసీ నేతలు, ఆ పార్టీ పత్రిక చేసిన తాజా విమర్శలు దీన్ని ధృవపరుస్తున్నాయి.

సోనియాతో భేటీలో ఏం జరిగింది?

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను చిత్తు చేసిన మమత మూడోసారి అధికారంలోకి రావడం దేశంలో ప్రతిపక్షాల ఆశలకు ఊపిరులూదింది. అప్పటి నుంచే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత మమతాబెనర్జీ తదితరులు తృతీయ కూటమి ఏర్పాటు యత్నాలు ప్రారంభించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత మమత గత నెలారంభంలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి చర్చలు జరిపారు. ఆ సందర్బంగా తృతీయ కూటమి ఏర్పాటులో తనకు సహకరించాలని సోనియాకు మమత విజ్ఞప్తి చేశారు.అయితే సోనియా తిరస్కరించినట్లు సమాచారం.

బెంగాల్ తప్ప ఇతర రాష్ట్రాల్లో ఏమాత్రం ఉనికి లేని పార్టీ జాతీయ స్థాయిలో ఏం ప్రభావం చూపగలదని సోనియా ప్రశ్నించారు. అటువంటి పార్టీకి నాయకత్వం వహిస్తున్న మమతకు మద్దతు ఇచ్చేందుకు తిరస్కరించారు. ఈ తిరస్కారాన్ని అవమానంగా భావించిన దీదీ అప్పటి నుంచే కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఆ పార్టీని దెబ్బ కొట్టాలని, టీఎంసీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బెంగాల్‌లో బీజేపీ.. బయట కాంగ్రెస్‌పై వల

సొంత రాష్ట్రం బెంగాల్‌లో బీజేపీని దెబ్బ కొట్టేందుకు ఆ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న మమత అదే రీతిలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ శాఖలు పెట్టి బలపడాలని భావిస్తున్నారు. అందుకు కాంగ్రెస్‌నే టార్గెట్ చేశారు. పక్క రాష్ట్రమైన త్రిపుర, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలపై దృష్టి సారించారు. కొన్నాళ్ల క్రితమే పార్టీ నేతలు డేరిక్ ఒబ్రెయిన్, ప్రసూన్ బెనర్జీలను గోవాకు పంపి అక్కడి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయించారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. తాజాగా మాజీ సీఎం, సోనియా సన్నిహితుడు అయిన లూజినో ఫెలీరో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఎంసీలో చేరేందుకు సిద్ధపడటంతో ఈ వ్యవహారం పరాకాష్టకు చేరింది.

మరోవైపు బెంగాలీలు అధికంగా ఉండే త్రిపురపైనా టీఎంసీ ఫోకస్ చేస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ సిల్చార్ ఎంపీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ను ఆకర్షించి పార్టీలో చేర్చుకున్నారు. ఆమెకు త్రిపుర బాధ్యతలు అప్పగించడంతో పాటు రాజ్యసభకు కూడా పంపారు. తమ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తృణమూల్‌పై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే టీఎంసీ కూడా ఘాటుగా స్పందిస్తోంది.కాంగ్రెస్‌ వల్లే దేశంలో బీజేపీ వేళ్లూనుకుందని టీఎంసీ పత్రిక జాగో తన వ్యాసంలో ఆరోపించింది. ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదని, అందువల్లే ఆ పార్టీ నుంచి నాయకులు బయట పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలను టీఎంసీలో చేర్చుకోవడాన్ని సమర్థించుకుంది. రెండు పార్టీల మధ్య రేగిన విభేదాలు బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యత యత్నాలకు విఘాతం కలిగిస్తాయేమోనని మిగిలిన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.