iDreamPost
android-app
ios-app

మైక్ టైసన్ మొదటి సినిమా ఏది

  • Published Sep 28, 2021 | 4:40 AM Updated Updated Sep 28, 2021 | 4:40 AM
మైక్ టైసన్ మొదటి సినిమా ఏది

నిన్న రిలీజ్ డేట్ చెప్తారేమో అని ఊహించినట్టు కాకుండా లైగర్ టీమ్ అనుకోని స్వీట్ షాక్ ఇచ్చింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మొదటిసారి ఇండియన్ స్క్రీన్ మీద తీసుకురాబోతున్నట్టు ప్రకటించి సంచలనమే రేపారు. ఎందుకంటే ఇది మాములు విషయం కాదు. ఇప్పటి తరహానికి ఆయన గొప్పదనం పూర్తిగా తెలిసినా తెలియకపోయినా మైక్ టైసన్ అనే పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. అలాంటి వ్యక్తిని పాన్ ఇండియా మూవీ కోసం అది కూడా తెలుగు సినిమా కోసం తీసుకురావడం అంటే గొప్పేగా. అసలు ఎలా ఒప్పించారో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది.

కానీ మూవీ లవర్స్ కు మాత్రం ఎక్కడో డౌట్ కొడుతోంది. మైక్ టైసన్ నిజంగా ఇప్పటిదాకా మన స్క్రీన్ మీద కనిపించలేదా అని. దాని వెనుక ఉన్న నిజం చూద్దాం. ఈ బాక్సింగ్ దిగ్గజం గతంలో మన తెరపై నటించిన మాట వాస్తవమే కానీ అది ఫుల్ లెన్త్ రోల్ కాదు. 2007 లో ఫూల్ అండ్ ఫైనల్ అనే బాలీవుడ్ సినిమా ఒకటి వచ్చింది. బ్రిటిష్ మూవీ స్నాచ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. సన్నీ డియోల్, షాహిద్ కపూర్, వివేక్ ఒబెరాయ్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. అహ్మద్ ఖాన్ దర్సకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో నాగార్జున సూపర్ హీరోయిన్ అయేషా టాకియ కథానాయిక.

ఇందులో మైక్ టైసన్ కనిపిస్తాడు. కాకపోతే సినిమా మొత్తం అయ్యాక ఎండ్ క్రెడిట్స్ లో వస్తాడు. ఇందులో నటించిన క్యాస్టింగ్ తాలూకు కటవుట్లను కొడుతూ రెండు మూడు చిన్న చిన్న షాట్స్ పెట్టారు. అప్పట్లో ప్రోమోల కోసం కూడా మైక్ ని వాడుకున్నారు. సో ఈ లెక్కన లైగర్ కన్నా ముందు టైసన్ కనిపించింది ఈ సినిమాలోనే. కాకపోతే కథకు సంబంధం లేని పాత్ర కాబట్టి పరిగణనలోకి తీసుకోలేదేమో కానీ వికీలో ఇతరత్రా సినిమాలకు సంబంధించిన డేటా వెబ్ సైట్స్ లో మైక్ టైసన్ పేరు దానికి ముడిపడి ఉంది. మొత్తానికి ఈయన్ని తీసుకురావడం ద్వారా దర్శకుడు పూరి జగన్నాధ్ పాన్ ఇండియాని మించిన ఫ్లేవర్ ని లైగర్ కు జోడించిన మాట వాస్తవం

Also Read : లవ్ స్టోరీ 3 రోజుల కలెక్షన్లు ఎంతొచ్చాయి