Idream media
Idream media
రెండు నెలల కాలంలో గులాబీ బాస్ కేసీఆర్ హస్తినలో మూడు సార్లు పర్యటించారు. ఆ సందర్భంలో కేంద్ర పెద్దలనే కాకుండా.. ఇతర పార్టీల నాయకులను కూడా కలిశారు. అనంతరం కొద్ది కాలం పాటు స్తబ్దుగా ఉన్న కేసీఆర్ హఠాత్తుగా కేంద్రంపై నిరసన స్వరం పెంచారు. దేశంలో అగ్గి రాజేస్తామంటూ భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ పూర్తిగా రాష్ట్ర వ్యవహారాలపైనే కేంద్రీకృతమై ఉన్న ఆయన ఇప్పుడు కేంద్రాన్ని టార్గెట్ చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీపై పోరాటానికి పిలుపు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో బలోపేతం కావడంతో పాటు.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలని యోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో కూడా జాతీయ ఫ్రంట్ వ్యూహరచన చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ దిశగా పట్టుబిగిస్తున్నారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై విరుచుకుపడిన విధానం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిశ్శబ్దంగా ఉన్నారు. ఇదే క్రమంలో ఆమె బాటలో కేసీఆర్ అడుగులు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం త్వరితగతిన జరుగుతోంది. ఆ తర్వాత జాతీయ రాజకీయాలకు అనువైన రాజకీయ పరిస్థితుల కోసం గులాబీ పార్టీ ఎదురు చూస్తోంది. మరోవైపు జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించడానికి ఈ కార్యాలయం వేదిక కాబోతుందని రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి.
గతంలోనే కేసీఆర్ పెడరల్ ఫ్రంట్ ఆలోచనను తీసుకువచ్చారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై ప్రాంతీయ పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. నేరుగా కేసీఆర్ వారిని కలసి జాతీయ రాజకీయాలపై అప్పట్లో చర్చించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనకు జాతీయ స్థాయిలో పాజిటివ్ గా చర్చ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పై పెద్దగా చర్చ జరగలేదు. పార్టీ కార్యాలయం శంకుస్థాపన కు ఢిల్లీ వెళ్లి వారానికి పైగానే అక్కడ మకాం వేయడంతో మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. అయితే.. అక్కడి నుంచి వచ్చాక కేసీఆర్ కేవలం హుజూరాబాద్ లో గెలుపు చుట్టూనే సమాలోచనలు చేశారు. ఎన్నిక ముగియడం.. అక్కడ బీజేపీ గెలవడంతో కేసీఆర్ నిరసన గళం వినిపిస్తున్నారు.
Also Read : TRS, KCR, BJP – జాగ్రత పడుతున్న కేసీఆర్..!
రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని ఆయన అనుకు న్నారో.. లేక.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో వచ్చిన ఫలితం కారణంగా.. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారనే భావన కావొచ్చు.. కేసీఆర్.. బీజేపీపై దుమ్మెత్తి పోశారు. ఇదీ.. ఇప్పటి వరకు చెబుతున్న మాట. కానీ.. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక మరో కోణం.. కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి కేసీఆర్ టార్గెట్ చేయాలని అనుకుంటే.. కేవలం రాష్ట్ర బీజేపీని టార్గెట్ చేస్తే.. సరిపోతుంది. ఎందుకంటే.. రాష్ట్రంలో బీజేపీని ఎదగకుండా.. చేయాలనే ఎత్తుగడ ఉండి ఉంటే.
కానీ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా బీజేపీని ఆయన ఏకేశారు. పెట్రోల్ డీజిల్ ధరలపై కేసీఆర్ వ్యాఖ్యలు అంత తీసిపారేసేవి కావు. ఇది జాతీయ మీడియాలోనూ ప్రధానంగా చోటు దక్కించుకున్నాయి. అదే సమయంలో దేశానికి సంబంధించిన సమస్యలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. నేపాల్ బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల జీడీపీని ఆయన ప్రస్తావిస్తూ.. మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేయాలని అనుకుంటే.. దేశ సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉండదు. కానీ అలా చేయలేదు. అదే సమయంలో సరిహద్దు సమస్యలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. నిజానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. దేశ సరిహద్దుల గురించి.. ఈ విషయంలోనూ బీజేపీ విఫలమైందని.. చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వ్యూహాత్మకంగానే కేసీఆర్ అలా మాట్లాడారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో.. ముఖ్యంగా మోడీ వంటి నాయకుడిని ఢీ కొట్టే విషయంలో ఒక శూన్యత ఆవరించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కొన్నాళ్లు ఊగినా.. ఆమెతో కలిసి వచ్చే నేతలు కనిపించడం లేదు.
దీంతో ఇప్పుడున్న శూన్యతను గుర్తెరిగిన కేసీఆర్.. తనకు అనుకూలంగా జాతీయ రాజకీయాలను మలు చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ అడుగులు వేశారని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కేంద్రం దృష్టి అంతా కూడా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఉంది. మరో ఆరు మాసాల్లో ఈ ఎన్నికలు పూర్తవుతాయి. ఈ లోగా.. ఢిల్లీలో తన సత్తా నిరూపించుకుంటే.. ఐదు రాష్ట్రాల్లో బీజేపీపై ప్రభావం పడేలా చక్రం తిప్పగలిగితే.. ఆయా రాష్ట్రాల్లో మూడు చోట్ల అయినా.. బీజేపీని ఓడించగలిగితే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తిష్ట వేసుకునే అవకాశం ఉంది. ఈ వ్యూహంతోనే కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలు మున్ముందు ఎలా మారబోతున్నాయో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
Also Read : KCR,Modi,Central Government-కేసీఆర్ కొత్త ఉద్యమం.. ఎలా ఉండనుందో?