iDreamPost
iDreamPost
ఈ మధ్య కాలంలో నిర్మాణ సంస్థలు సాంకేతిక కారణల పేరు చెప్పి అభిమానుల సహనంతో బాగానే ఆడుకుంటున్నాయి. ట్రైలర్ లేదా లిరికల్ సాంగ్ విడుదల ఫలానా తేదీ ఫలానా టైం అని చెప్పాక కూడా సకాలంలో వాటిని యుట్యూబ్ లో విడుదల చేయలేక ఫ్యాన్స్ తో నానా తిట్లు తింటున్నాయి. నిన్న పుష్ప ట్రైలర్, అంతకు ముందు రాధే శ్యామ్ మొదటి పాట, వీటి మధ్య ఆచార్య సిద్దా టీజర్ అప్డేట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. టెక్నికల్ రీజన్ అని చెప్పడం వరకు బాగుంది కానీ ఓ రెండు మూడు నిమిషాల వీడియోకి ఆ మాత్రం ప్లానింగ్ ఉండదా అనే ఫిర్యాదులు అభిమానుల నుంచి ఎక్కువవుతున్నాయి.
ఇంకో కోణంలో చూస్తే ఇలాంటి జాప్యం ఇంకో రూపంలో సహాయపడుతోంది కూడా. ఉదాహరణకు ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఫలానా ప్రమోషన్ కంటెంట్ విడుదల చేస్తాం అని ప్రకటిస్తారు. కానీ సరిగ్గా దానికి రెండు మూడు నిమిషాల ముందు వాయిదా తప్పలేదు మరి కాసేపట్లో అని చిన్న సవరణ ఉంటుంది. అది మొదలు మళ్ళీ ఎప్పుడు అప్ డేట్ చేస్తారా అని ఫ్యాన్స్ పదే పదే ఆయా ట్విట్టర్ హ్యాండిల్స్, యుట్యూబ్ ఛానల్స్ రీ ఫ్రెష్ కొడుతూ కూర్చుంటారు. అంతే కాదు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చర్చలు, శాపనార్థాలు, తోటి అభిమానులతో బాధలు పంచుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
తీరా ఏ తొమ్మిది గంటలకో పైన చెప్పిన కంటెంట్ రిలీజ్ అవుతుంది. అంటే ఓ మూడు గంటల పాటు తమ సినిమా గురించిన చర్చ జరగడం సదరు ప్రొడక్షన్ హౌస్ కు ఉపయోగపడుతుందన్న మాట. ఇందులో వేలు కాదు లక్షల్లో నెటిజెన్లు పాల్గొంటారు. ఈ లెక్కన చూస్తే బజ్ కోసం ఇదంతా చేస్తున్నారా లేక నిజంగానే అంత చిన్న ట్రైలర్లకు కూడా సాంకేతిక సమస్యలు ఎదురవుతాయా అనే అనుమానం కలగడం సహజం. ఒకరో ఇద్దరికో జరిగితే అనుమానం ఉండదు. కానీ దాదాపు అన్ని బ్యానర్లు ఇదే తంతు కొనసాగిస్తున్నాయి. పైకి సాకుగా కనిపిస్తున్నా ఈ టెక్నికల్ రీజన్స్ అనేవి సానుకూల అంశాలుగా మారుతున్న మాట వాస్తవం.
Also Read : December 10th Releases : డిసెంబర్ 10 – సందడి ఉంది కానీ