Idream media
Idream media
రాజధాని భూముల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకల కారణంగా చంద్రబాబు చిక్కుల్లో పడబోతున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే పరిణామాలున్నాయి. తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీ అందించిన రిపోర్ట్, మీడియా ముందు పేర్ని నాని వ్యాఖ్యలు ఆ దిశలోనే కనిపిస్తున్నాయి. చంద్రబాబుకి సీబీఐ చిక్కులు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించేలా ఆధారాలతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దాంతో ఈ వ్యవహారాల పట్ల చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా అంతా భావిస్తున్నారు.
ఏపీ క్యాబినెట్ భేటీ తర్వాత పేర్ని నాని మాట్లాడుతూ పాపం పండే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. లోకాయుక్తకి ఇవ్వాలా లేక సీబీఐ, సీబీసీఐడీ విచారణ సాగించాలా అన్నది న్యాయనిపుణులతో మాట్లాడి నిర్ణయిస్తామని తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఆధారాలు కూడా సంపాదించామని, చర్యలకు ఉపక్రమిస్తున్నామని మంత్రి తేటతెల్లం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం నేతలకు తలనొప్పులు అనివార్యం అని అంతా అంచనా వేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు అమరావతి పర్యటనలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయించాలని ఛాలెంజ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏకంగా సీబీఐని రంగంలో దింపాలని చూస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఆధారాల సహాయంతో సీబీఐ విచారణ కోరబోతున్నట్టు చంద్రబాబుకి సమాచారం అందడంతోనే జ్యుడీషియల్ ఎంక్వయిరీ కోసం డిమాండ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. జ్యుడీషియల్ ఎంక్వయిరీ అంటే జడ్జీ ఆధ్వర్యంలో జరిగే వ్యవహారం కాబట్టి చంద్రబాబు తన అవకాశాలు వెదుక్కునే అవకాశం ఉంటుందని భావించి ఉంటారనే వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం భిన్నంగా ఆలోచిస్తూ సీబీఐ బోనులో చంద్రబాబు ని నిలబెట్టే యోచన చేయడం ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో రాజధాని అంశం ఎంత చర్చనీయాంశంగా మారుతుందో ఈ విషయంలో చంద్రబాబు మీద సీబీఐ విచారణ కూడా అదే రీతిలో దుమారం రేపడం ఖాయంగా ఉంది. చంద్రబాబుకి సీబీఐ ద్వారా పెద్ద సమస్య ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. దానిని అధిగమించేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఆధారాలున్నాయని చెబుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా చంద్రబాబుని ఇరికిస్తే వ్యవహారం ఎటుమళ్లుతుందన్నది చూడాల్సి ఉంది. కానీ టీడీపీ అధినేతకు మాత్రం తల ప్రాణం తోకకు వస్తుందనడంలో సందేహం లేదు.