iDreamPost
android-app
ios-app

Bjp ,trs – ఔనా.. ఆ 25 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవ‌రు? బీజేపీ నేత వ్యాఖ్య‌లపై పార్టీల్లో చ‌ర్చ

Bjp ,trs – ఔనా.. ఆ 25 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవ‌రు? బీజేపీ నేత వ్యాఖ్య‌లపై పార్టీల్లో చ‌ర్చ

భారతీయ జ‌న‌తా పార్టీ క‌న్ను ఇప్పుడు తెలంగాణ‌పై ప‌డింది. కాస్త ఊపు ప్రారంభం కావ‌డంతో బీజేపీ అగ్ర‌నేత‌లు కూడా రాష్ట్రంపై ప‌ట్టుబిగిస్తున్నారు. స్థానిక నేత‌ల‌తో త‌ర‌చూ ట‌చ్ లో ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బ‌లోపేత‌మ‌వుతున్న తీరు, మ‌రింత బ‌లం పుంజుకోవ‌డానికి ఆచ‌రించాల్సిన విధానాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు. అమిత్ షా కూడా తెలంగాణ నేత‌ల‌కు ఢిల్లీ నుంచి డైరెక్షన్ లు ఇస్తున్నారు. గ్రామ స్థాయి వరకూ వెళ్లిన పార్టీని బూత్‌ స్థాయి వరకూ తీసుకెళ్లేలా కార్యకర్తలను ప్రోత్స‌హించాల‌ని నేత‌ల‌కు హితవు ప‌లుకుతున్నారు. ఇలా ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అధికారం సాధించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లపై విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆయ‌న ఏమ‌న్నారంటే..

తరుణ్‌చుగ్‌ చేసిన కామెంట్స్ ఇటు బీజేపీతో పాటు, టీఆర్ఎస్, కాంగ్రెస్ లో కూడా వైర‌ల్ అవుతున్నాయి. చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. దీంతో అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రెండు రోజుల క్రితం ఆయ‌న రాజేసిన సెగ తాలూకు పొగ ఇప్పుడు అన్ని పార్టీల‌నూ క‌మ్మేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ‌కు అర‌వై మంది అభ్యర్థులు కూడా దొరకరని చెప్ప‌డం అటుంచితే.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ నుంచి ఇర‌వై మంది నేతలు టచ్‌లో ఉన్నారని చెప్ప‌డంతో వారెవ‌రు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొంత‌కాలంగా తెలంగాణ రాజ‌కీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ కార్య‌క్ర‌మాలు, స‌భ‌లు, స‌మావేశాల‌తో ర‌క్తి క‌ట్టిస్తున్నాయి.

ఎన‌భై ప‌క్కా అట‌..!

బీజేపీ స్థానిక నేత‌ల నుంచి అగ్ర నేత‌ల వ‌ర‌కూ ఎవ‌రో ఒక‌రు తెలంగాణ రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన‌భై స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే బీజేపీ సత్తా తెలుస్తుందన్నారు తరుణ్ చుగ్. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీది ముగిసిన అధ్యాయమని ఎద్దేవా చేశారు. త‌రుణ్ చుగ్ మాట‌ల‌కు సంకేతంగా అన్న‌ట్లుగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను బీజేపీ నేత‌లు ఉప‌యోగించుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా పోటీలో ఉన్న స్వ‌తంత్రుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ.. త‌మ వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన టీఆర్ఎస్ కూడా అప్ర‌మ‌త్త‌మైంది.

కొట్టిపారేస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్

తరుణ్ చుగ్ చేసిన కామెంట్స్‌పై అధికార పార్టీ టీఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. క‌ల్పిత క‌థ‌లు, క‌ట్టు క‌థ‌లు బీజేపీ నేత‌ల‌కు అల‌వాటైపోయిందంటూ విమ‌ర్శిస్తున్నారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పార్టీ, అధికారంలోకి ఎలా వస్తుందంటూ ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేద‌ని పేర్కొంటున్నారు. కాగా, రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నామని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ నేత వీహెచ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్త‌మ్మీద త‌రుణ్ చుగ్ చేసిన కామెంట్లు టీ. రాజ‌కీయాల్లో వేడిని పెంచాయి. కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

Also Read : Bjp, Yogi – యోగి ఓకే.. బీజేపీ నాట్ ఓకే! -యూపీ ఓటర్ల తాజా మనోగతం