iDreamPost
android-app
ios-app

బాబుకి ఆప్తుడైన అధికారికి మ‌రిన్ని ఇక్క‌ట్లు

  • Published Dec 16, 2019 | 2:25 AM Updated Updated Dec 16, 2019 | 2:25 AM
బాబుకి ఆప్తుడైన అధికారికి మ‌రిన్ని ఇక్క‌ట్లు

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి స‌న్నిహితుడిగా పేరున్న జాస్తి కృష్ణ కిషోర్ మ‌రిన్ని చిక్కుల్లో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఈ ఐఆర్ఎస్ అధికారిని స‌స్ఫెండ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ నీయాంశం అయ్యింది. తాజాగా ఆయ‌న పై సీఐడీ అధికారులు కేసు న‌మోద చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కోట్ల రూపాయ‌ల నిధులు దుర్వినియోగం చేసిన అంశంలో కృష్ణ కిషోర్ ఇరుక్కున్నారు. సీఐడీ తో పాటుగా ఏసీబీ కూడా ఈ వ్య‌వ‌హారాల‌పై ద‌ర్యాప్తున‌కు రంగంలో దిగుతున్నాయి.

ఏపీ ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి స‌ల‌హా మండ‌లిలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు పాల‌న‌లో ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల నుంచి ఏపీకి డిప్యూటేష‌న్ పై వ‌చ్చారు. ఆ స‌మ‌యంలోనే కోట్ల రూపాయ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌నే అభియోగాల‌పై ఆయ‌న‌పై ఉన్నాయి. ఇటీవ‌ల ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక స‌దుపాయాలు, వాణిజ్య శాఖ‌లు విడివిడిగా ఈ వ్య‌వ‌హారంపై నివేదిక‌లు స‌మ‌ర్పించాయి. వాటి ఆధారంగా పెద్ద స్థాయిలో అక్ర‌మాలు సాగిన‌ట్టు నిర్ధారించిన ప్ర‌భుత్వం ఈనెల 12న స‌స్ఫెన్ష‌న్ ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది.

తాజాగా ఏపీ ఎక‌నామిక్ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డ్ యాక్ట్ -2018 ప్ర‌కారం సెక్ష‌న్స్ 188,403,409,120బి కింది కేసు న‌మోదు చేశారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. పే అండ్ అకౌంట్స్ విభాగానికి చెందిన మ‌రో అధికారి శ్రీనివాస‌రావుని కూడా ఇప్ప‌టికే ప్ర‌భుత్వం స‌స్ఫెండ్ చేసింది. ఈ నేప‌థ్యంలో కేసు ద‌ర్యాప్తులో మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. రాయితీల పేరుతో కొన్ని సంస్థ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించిన దానికి త‌గిన ఆధారాలు ఉండ‌డంతో జాస్తి కృష్ణ కిషోర్ కి మ‌ర‌న్ని క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ స‌స్ఫెన్ష‌న్ ప‌ట్ల విప‌క్ష నేత చంద్ర‌బాబు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక ఇప్పుడు కేసు కూడా న‌మోద‌య్యి, ద‌ర్యాప్తు ప్రారంభ‌మ‌వుతున్న వేళ టీడీపీ అధినేత స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పైగా జ‌గ‌న్ కేసుల‌ను చూపించి క‌క్ష సాధింపు చ‌ర్య‌గా కొంద‌రు అభివర్ణించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ తీరా చూస్తే వివిధ శాఖ‌లు అందించిన నివేదిక‌ల్లో స‌ష్ట‌మైన ఆధారాలుండ‌డంతో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ప్ర‌భుత్వం చివ‌ర‌కు ఈ కేసులో ఎలాంటి విష‌యాల‌ను బ‌య‌ట‌పెడుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. అటు అధికార‌, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదో హాట్ టాపిక్ గా మార‌బోతోంది.