Idream media
Idream media
తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడేది లేదని అనిల్ స్పష్టం చేశారు. ఒక్క అంగులం కూడా ఎత్తు తగ్గదని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దేవినేని ఉమా.. టేపు తెచ్చుకుని కోలుచుకోవాలని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దేవినేని ఉమానే ప్రాజెక్టు ఎత్తు ఎంత ఉందో చూస్తారని అనిల్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి దేవినేని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లు.. దేవినేని ఉమాకు ఏ బట్టలు కావాలో అవే పెట్టి మరీ ఆహ్వానిస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే లోపు ఎక్కడకీ పోరు కదా అన్న అనిల్.. అప్పటి వరకూ ఆగాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారని శనివారం దేవినేని ఉమా విమర్శలు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ వచ్చిన కథనాలను చూపిస్తూ దేవినేని ఉమా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రాజెక్టు ఎత్తు, నిర్మాణ పనులపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా నిర్వాసితుల సంఖ్య భారీగా తగ్గించి.. ఆ మేరకు పరిహారాన్ని 27,500 కోట్ల రూపాయల నుంచి 3,500 కోట్ల రూపాయలతో సరిపెట్టాని జగన్ ప్రభుత్వం యోచిస్తోందని ఉమా ఆరోపించారు. ఉమా ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి అనిల్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు.