ఐపీఎల్ 2021 మినీ వేలంలో విదేశీ స్టార్ ప్లేయర్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి 61 స్థానాలు ఖాళీగా ఉండగా 292 మంది ప్లేయర్స్ వేలంలో పాల్గొన్నారు. వీరిలో 164 మంది భారత ఆటగాళ్లు కాగా 125 మంది విదేశీ ప్లేయర్లు మరో ముగ్గురు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
రికార్డు సృష్టించిన క్రిస్ మోరిస్
కాగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 16 కోట్ల రికార్డును 16.25 కోట్ల రూపాయల ధర పలికి రికార్డు సృష్టించాడు.మోరిస్‌ను సొంతం చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ చివరకు రాజస్థాన్ రాయల్స్ 16.25 కోట్ల అత్యధిక ధరతో క్రిస్ మోరిస్‌ను సొంతం చేసుకుంది.
15 కోట్లు పలికిన కైల్ జేమిసన్
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కైల్ జేమిసన్ కోసం పంజాబ్ కింగ్స్ చివరివరకు పోటీ పడింది.కానీ చివరకు బెంగుళూరు 15 కోట్లకు సొంతం చేసుకుంది. బెంగుళూరు అంతకు ముందు మాక్స్‌వెల్‌ను 14.25 కోట్లకు దక్కించుకోవడం గమనార్హం. కేవలం ఇద్దరు ఆటగాళ్ల కోసం బెంగుళూరు ఫ్రాంచైజీ 29.25 కోట్లను వెచ్చించడం విశేషం..
భారీ ధరకు అమ్ముడుపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్
పంజాబ్ కింగ్స్ తరపున గతేడాది ఘోరంగా విఫలమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు భారీ ధర లభించింది. బిగ్ బాష్ లీగ్ లో తిరిగి ఫామ్ అందుకున్న మ్యాక్స్‌వెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ మధ్య పోటీ నెలకొంది. చివరకు బెంగుళూరు ఫ్రాంచైజీ రూ. 14.25 కోట్లకు మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకుంది.
జే రిచర్డ్‌సన్‌కు అనూహ్య ధర
ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ అనూహ్య ధరకు అమ్ముడుపోయాడు. బిగ్ బాష్ లీగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రిచర్డ్‌సన్ కోసం దిల్లీ, బెంగళూరు, ముంబయి ఫ్రాంచైజీలు చివరి వరకు పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు దక్కించుకుంది అతడిని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది.
జాక్‌పాట్ కొట్టిన కృష్ణప్ప గౌతమ్
కర్ణాటక ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ తగిలింది. 20 లక్షల కనీస ధరతో వేలంలో దిగిన కృష్ణప్ప గౌతమ్ అనూహ్య ధరకు అమ్ముడుపోయాడు. హైదరాబాద్, కోల్‌కతాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పుడు రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా యువపేసర్ మెరెడిత్‌ను పంజాబ్ కింగ్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. 40 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన అతడి కోసం ఢిల్లీ, పంజాబ్ ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా చివరకు పంజాబ్ కింగ్స్ 8 కోట్లకు మెరెడిత్‌ను చేజిక్కుంచుకుంది.
రెండుకోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన మొయిన్ అలీని రూ. 7కోట్లను కుమ్మరించి చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు టామ్ కరన్ కోసం హైదరాబాద్ ప్రయత్నం చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5.25 కోట్లకు దక్కించుకుంది.
ఆసీస్ పేసర్ కౌల్టర్ నైల్‌ను 5 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాడు. 1.5 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన అతడిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ ప్రయత్నం చేసినా ముంబయ్ ఇండియన్స్ జట్టు 5 కోట్లకు కౌల్టర్ నైల్‌ను సొంతం చేసుకుంది.
ఆసీస్ ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్‌ను పంజాబ్ కింగ్స్ రూ.4.20 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హసన్ ను 3.20 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు దక్కించుకుంది.
ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కనీస ధర 2 కోట్లు కాగా మరో 20 లక్షలు జోడించి ఢిల్లీ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. మిగిలిన ఫ్రాంచైజీలు స్మిత్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దాంతో 2 కోట్ల 20 లక్షలకే స్మిత్ ఢిల్లీ సొంతం చేసుకుంది.
ప్రపంచ నంబర్ వన్ టి 20 ఆటగాడు డేవిడ్ మలన్ ని భారీ ధరకు కొనుగోలు చేస్తారన్న అంచనాలు తలకిందులయ్యాయి. 1.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు డేవిడ్ మలన్ ని చేజిక్కుంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చప్పట్లు
కనీస ధర 50 లక్షలకు చెతేశ్వర్ పుజారా వేలానికి రాగా ఏ ఒక్క ఫ్రాంచైజీ పుజారా కోసం బిడ్డింగ్ వేయలేదు.. దాంతో చెన్నై పుజారాను కనీస ధరకు కొనుగోలు చేసింది. దీంతో మిగిలిన ఫ్రాంచైజీలు చెన్నైను అభినందిస్తూ చప్పట్లు కొట్టాయి.
సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లాను ముంబయి రూ.2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా ఉమేశ్ యాదవ్‌ను దిల్లీ కేవలం రూ.కోటికే సొంతం చేసుకుంది.