iDreamPost
android-app
ios-app

ఓర్వ‌లేని రాత‌లు

ఓర్వ‌లేని రాత‌లు

‘‘ఐదేళ్ల పాలనలో ఆరునెలలు తక్కువ కాలమే. కానీ… ఈ స్వల్ప కాలంలోనే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి’’ అని ఆంధ్ర‌జ్యోతిలో జ‌గ‌న్ స‌ర్కార్ ఆరు నెల‌ల పాల‌న‌పై రాసిన ఇంట్రోనే ఆ క‌థ‌నం ఉద్దేశం ఏంటో స్ప‌ష్టంగా తెలియిజేస్తోంది.

ఇదే ఏ చంద్ర‌బాబునాయుడు పాల‌కుడై ఉంటే ‘‘ఐదేళ్ల పాలనలో ఆరునెలలు చాలా చాలా తక్కువ కాలం. కానీ… ఈ అతి స్వల్ప కాలంలోనే చంద్ర‌బాబు ప్రభుత్వ నిర్ణయాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల విప్ల‌వాన్ని సృష్టించాయి. ఇక్క‌డ పాల‌న‌పై అధ్య‌య‌నానికి దేశంలోని అనేక రాష్ట్రాలు, అంతర్జాతీయస్థాయిలో వంద దేశాలు భార‌త్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎక్క‌డుంద‌ని వెతుక్కుంటూ వ‌స్తున్నాయ్‌’’ అని ఆంధ్ర‌జ్యోతిలో రాసేవారు కాదా?

‘‘ఆరు నెలల్లోనే మా తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కంటే గొప్ప ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను. పరిపాలన అంటే ఏమిటో చూపిస్తాను. ఆరు నెలల్లోనే దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను’’… ఈ ఏడాది మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. మంచిదే.

Read Also: ఆంధ్రజ్యోతి రాసిందా?అయితే అనుమానించ వలసిందే!!!

ఇదే క‌థ‌నంలో …
‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాదయాత్రలో వచ్చిన వినతుల ఆధారంగా రూపొందించిన మేనిఫెస్టోను జగన్‌ భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని పదేపదే చెబుతున్నారు. అందులో పొందుపరిచిన ‘నవ రత్నాలు’ అమలుపైనే పూర్తిగా దృష్టి సారించారు’’ అని రాశారు. మ‌రి జ‌గ‌న్ ఎన్నిక‌ల హామీల‌పై దృష్టి పెట్ట‌కుండా చంద్ర‌బాబు హామీల‌ను అమ‌లు చేయాలా? ఏందీ అర్థంప‌ర్థం లేని రాత‌లు. ఒక‌వైపు న‌వ‌ర‌త్నాల అమ‌లుపై జ‌గ‌న్ దృష్టి పెట్టార‌నే రాస్తూనే,మ‌రోవైపు స‌న్నాయి నొక్కులు.

పెట్టుబ‌డుల‌పై ఏమంటారంటే…

‘‘ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులకు ‘ప్రతికూల’ వాతావరణం నెలకొందని విశ్లేషకులు, పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా అంశాలపై జాతీయ పత్రికల్లో సంపాదకీయాలు, ప్రత్యేక కథనాలు అనేకం వచ్చాయి. ఒక రాష్ట్రంలో పరిస్థితిపై… అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలల్లోనే ఈ స్థాయిలో జాతీయ మీడియా స్పందించడం బహుశా ఇదే మొదటిసారి’’ అని ఆ క‌థ‌నంలో విశ్లేషించారు.

తెలుగులో ఆంధ్ర‌జ్యోతిలో రాసిన ఈ క‌థ‌నం వెనుక దురుద్దేశం ఉన్న‌ట్టే , జాతీయ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల వెనుక కూడా లేద‌ని ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రా? జాతీయ ప‌త్రిక‌లేమైనా ఆకాశం నుంచి ఊడిప‌డ‌లేదు క‌దా.

Read Also: వైసీపీలోకి బ‌ద్వేలు మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ‌?

చంద్ర‌బాబు ఐదేళ్ల‌లో క‌నీసం ఒక్క ప్ర‌భుత్వ ఉద్యోగ‌మైనా ఇచ్చిన దాఖ‌లాలు ఉన్నాయా? చ‌ంద్ర‌బాబు పాల‌న‌తో పోల్చి చూస్తే జ‌గ‌న్ తాను ఇచ్చిన హామీల అమ‌లుకు శ‌ర‌వేగంతో ముందుకు పోతున్నాడు. అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 1.40 ల‌క్ష‌ల శాశ్వ‌త ఉద్యోగాలు క‌ల్పించారు. ప్ర‌తి ఊరిలోనూ ముగ్గురు న‌లుగురికి శాశ్వ‌త ప్ర‌భుత్వ ఉద్యోగాలు ల‌భించాయి. బాబు పాల‌న‌లో ఆయ‌న కుమారుడు లోకేశ్‌కు మంత్రి ప‌ద‌వి త‌ప్ప మ‌రెవ‌రికైనా ఒక్కటంటే ఒక్క అవ‌కాశ‌మైనా ల‌భించిందా?

చంద్ర‌బాబు తానిచ్చిన హామీల‌ను మాఫీ చేశాడు త‌ప్పితే, ఒక్క మాట‌ను కూడా నిల‌బెట్టుకోలేదు. అందుకే ఆయ‌న‌కు అంత‌టి ఘోర ప‌రాజ‌యం. కానీ జ‌గ‌న్ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అంతేకాదు చంద్ర‌బాబు ఘోర ప‌రాజ‌యం కూడా అత‌నికి ఓ గుణ‌పాఠం నేర్పుతోంది. హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోతే ఎవ‌రికైనా బాబు గ‌తే అన్న‌ది మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌లు చేసిన హెచ్చ‌రిక‌.

వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందంటున్న ఆంధ్ర‌జ్యోతి…మ‌రి చంద్ర‌బాబు తాను అధికారం నుంచి దిగిపోతూ రాష్ట్ర బ‌డ్జెట్‌లో కేవ‌లం రూ.100 కోట్లు మిగిల్చార‌నే విష‌యాన్ని కూడా రాసి ప్ర‌జ‌ల‌కు గుర్తు చేసి ఉంటే బాగుండేది. రైతుల‌కు నాలుగేళ్లు చొప్పున ఇస్తాన‌న్న భ‌రోసా సొమ్మును మ‌రో ఏడాది పొడిగించ‌డం జ‌గ‌న్ చేసిన మంచి కాదా? అగ్రిగోల్డ్ బాధితుల‌ను ఆదుకుంటున్న విష‌యం ఎవ‌రికి తెలియ‌దు? ఆటో , క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు ఏడాదికి రూ.10 వేలు, వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపుల‌కు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయ‌డానికి బ‌డ్జెట్ కేటాయించ‌డం నిజం కాదా? అన్నిటికి మించి ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తూ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల్లోని సాహ‌సాన్ని గుర్తించ‌లేక‌పోవ‌డం కంటే వివ‌క్ష ఉందా?

Read Also: అనారోగ్యం పై చింత లేదిక – విశ్రాంతి సమయంలో భత్యం

ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి హామీ అమ‌లుకు ప‌క్కా కార్యాచ‌ర‌ణ‌తో జ‌గ‌న్ స‌ర్కార్ అడుగులు ముందుకేస్తోంది. ఇసుక పాల‌సీపై స‌కాలంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో కొంత న‌ష్టం జ‌రిగిన మాట నిజం. బిడ్డ పుట్ట‌గానే న‌డ‌క ప్రారంభించ‌దు. జోగాడటంతో మొద‌లు పెట్టి త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ క్ర‌మంగా న‌డ‌క‌ను అల‌వాటు చేసుకొంటుంది. జ‌గ‌న్ పాల‌న‌లో కూడా త‌ప్పులు దొర్లాయి. అయినంత మాత్రాన ఆరునెల‌ల‌కే కొంప‌లేవో మునిగిపోయాయ‌ని కేక‌లు వేయ‌న‌వ‌స‌రం లేదు.

జ‌గ‌న్ త‌ప్పులు చేస్తే తిరిగి అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనే క‌దా. మ‌రి జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఆరునెల‌ల్లోనే అంత అసంతృప్తే వ‌చ్చి ఉంటే…టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకోవాల్సిన శుభ‌దినమే క‌దా.

కానీ జ‌గ‌న్ మాట ఇస్తే త‌ప్ప‌డ‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంద‌ని టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

‘‘వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. బడ్జెట్‌ తలకిందులవుతోంది. ఆదాయం అంచనాకు, అసలు ఆదాయానికీ మధ్య రూ.80వేల కోట్ల వరకు తేడా ఉంటుందని తాజా అంచనా. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తుండటం.. ఆదాయం పడిపోవడంతో అభివృద్ధి పనులకు నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది. జనవరిలో మరిన్ని కొత్త పథకాలు వస్తుండటంతో పరిస్థితి దయనీయంగా మారుతుందని’’ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Read Also: ఆపద సమయంలో ఆపన్న హస్తాలు

చంద్ర‌బాబు రాష్ట్ర ఖ‌జానాను ఖాళీ చేసినా, జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుండ‌టంతో ప్ర‌త్య‌ర్థుల‌కు దిక్కుతోచ‌డం లేదు. ఆ ప్ర‌స్టేష‌న్‌లో వ‌స్తున్న క‌థ‌నాలు, మాట‌ల‌గానే అర్థం చేసుకోవాలి. దానికి నిద‌ర్శ‌న‌మే ఆంధ్ర‌జ్యోతిలోజ‌గ‌న్ ఆరునెల‌ల పాల‌న‌పై వ‌చ్చిన విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నంలో చివ‌రి వాక్యాలను చ‌ద‌వుకోవాలి.