Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో మార్చి 4 నుంచి మార్చి 23 వరకూ ఇంటర్ పరీక్షలు జరుగుతాయి.రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 411 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.ప్రథమ,ద్వితీయ సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.వీరిలో జనరల్ గ్రూపులకు చెందిన విద్యార్థులు 9,96,023 మంది కాగా, వృత్తి విద్యకు కోర్సులకు చెందిన విద్యార్థులు 69,133 మంది ఉన్నారు.
పరీక్షల నిర్వహణలో సాంకేతికతకు పట్టం కట్టిన బోర్డ్:
రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ఎగ్జామ్స్-2020 కోసం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తుంది. పట్టణ,నగర ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేశారు. పరీక్షా కేంద్రాలు గుర్తించడానికి “IPE సెంటర్ లొకేటర్” అనే యాప్‌ను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ లేదా గుగూల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో ప్రైవేట్,కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు తమ ఫీజులు చెల్లించలేదని ఎగ్జామ్స్ హాల్ టికెట్లు విద్యార్థులకు జారీ చేయకుండా కళాశాలల చుట్టూ చివరి నిమిషం వరకు తిప్పుకునే పరిస్థితి ఉండేది.ఈ సమస్యపై దృష్టి పెట్టిన బోర్డు అధికారులు తమ హాల్ టికెట్‌ను ఇంటర్నెట్ నుంచీ డౌన్‌లోడ్ చేసుకొని ప్రిన్సిపల్ సంతకం అవసరం లేకుండానే నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి ఎగ్జామ్స్ రాసే వెసులుబాటును విద్యార్థులకు కల్పించారు.
కాపీయింగ్ నివారణకు సీసీ కెమెరాలతో నిఘా:
ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ చేయనివ్వకుండా ప్రతి పరీక్షా గది నందు నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఆన్‌లైన్ ద్వారా సీసీ కెమెరాలను విజయవాడ నుంచీ పర్యవేక్షించి అవసరమైన సూచనలు ఎప్పటికప్పుడు అందించనున్నారు.అంతే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్,సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాల్నీ పరీక్షలు జరిగే సమయంలో మూసివేస్తారు.పరీక్షా కేంద్రాలలోకి ఇన్విజిలేటర్లు సెల్‌ఫొన్స్ తీసుకు వెళ్లడం నిషేధం.డిపార్టుమెంట్ ఆఫీసర్, ఛీప్ సూపరింటెండెంట్స్ దగ్గర మాత్రమే సెల్‌ఫోన్స్ ఉంటాయి.
పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పన:
విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాలలో నేలపై కూర్చోబెట్టకుండా బెంచీల ఏర్పాటు,వాటర్ సదుపాయం కల్పించడంతోపాటు ఒక ఆరోగ్య కార్యకర్తను పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచుతారు.