iDreamPost
android-app
ios-app

బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ అల్లుడు…

బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ అల్లుడు…

టెక్నాలజీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా విదేశాల్లో భారతీయులు రాణిస్తున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ఇంద్ర నూయి వంటివారు సాఫ్ట్ వేర్, ఇతర వ్యాపార వాణిజ్య రంగాల్లో జయకేతనం ఎగురవేసి భారతీయుల సత్తాను చాటారు..

ఆ తరువాత కొందరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు విదేశాల్లో కొన్ని రాజకీయపదవుల్లోనూ నియమితులయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా 39 ఏళ్ల రిషి సునక్ ఏకంగా బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులై ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న దేశానికి సారథ్యం వహిస్తున్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, పాలిటిక్స్ చదువుకున్న రిషి అక్కడే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి రెండో కుమార్తె అక్షితను కలిశారు. వారి పరిచయం ప్రేమగా మరి పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఇదిలా ఉండగా రిషి 2015లో బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ యంపీగా ఎన్నికయ్యారు. అసాధారణ ప్రతిభ, వివిధ అంతర్జాతీయ అంశాలమీద ఉన్న అవగాహనతో అనతికాలంలోనే బోరిస్ జాన్సన్ దృష్టిని ఆకర్షించారు.

ఇదిలా ఉండగా బ్రెగ్జిట్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడంతోబాటు రానున్న విపత్కర పరిస్థితులను సమ
ర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం రిషి కి మెండుగా ఉందన్న దృఢ విశ్వాసంతోనే ప్రధాని ఈయనకు ఈ కీలకమైన బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే కేబినెట్లో జూనియర్ మంత్రిగా చేస్తూ కీలక సమయాల్లో తన ప్రతిభతో ప్రధాని దృష్టిని ఆకర్షించారు.

పార్టీ తరఫున బలమైన వాణి వినిపించడంలోను, టివి చర్చల్లో పార్టీని డిఫెండ్ చేయడంలోను రిషి చురుకైన పాత్ర పోషిస్తూ బ్రిటన్లో ప్రధాని తరువాత అత్యంత కీలకమైన ఆర్ధికమంత్రి పదవికి ఎదిగారు.

ట్రిలియన్ అమెరికన్ డాలర్లు విలువైన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నడపడంతోబాటు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన బ్రిటన్ ఇప్పుడు ప్రపంచంతో కొత్త ఆర్థిక బంధాలను పెంపొందించుకునే పనిలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కీలక పెరలో రిషి సమర్థమైన పాత్ర పోషిస్తారని కన్జర్వేటివ్ పార్టీ విశ్వాసంతో ఉంది. ఇదిలా ఉండగా ఈయన నియామకాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ కూడా కొనియాడారు. సముచితమైన మిర్ణయం తీసుకున్నారని ప్రధాని బోరిస్ జాన్సన్ ను అభినందించారు. ఈయనతోబాటు ప్రీతి పటేల్, ఆలోక్ శర్మ అనే మరో ఇద్దరు భారత సంతతికి చెందిన వారు ఈ కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు.