iDreamPost
android-app
ios-app

ధోని స్థానం భర్తీ సులభం కాదని ప్రకటించిన భారత బ్యాటింగ్ కోచ్

ధోని స్థానం భర్తీ సులభం కాదని ప్రకటించిన భారత బ్యాటింగ్ కోచ్

క్రికెట్ ప్రపంచంలో మ్యాచ్ బెస్ట్ ఫినిషర్‌గా జార్ఖండ్ డైనమెట్ మహేంద్రసింగ్ ధోనీ పేరొందాడు. కీపింగ్‌లోను చురుకుగా,తెలివిగా ప్రవర్తించి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ని బోల్తా కొట్టించడంలో మహేంద్రుడు దిట్ట.అయితే తాజాగా భారత మాజీ కెప్టెన్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రకటించాడు.అలాగే ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు కేఎల్ రాహుల్‌తో పోలిస్తే రిషబ్ పంత్‌కే టీమిండియా మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలుస్తుందని విక్రమ్ రాథోడ్ వెల్లడించి విమర్శకులకు పని పెట్టాడు.

భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ ‘‘గతేడాది రిషబ్ పంత్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో అతను ఆశించిన మేర పరుగులు సాధించలేకపోయాడు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి మద్దతుగా నిలుస్తోంది.దీనికి ప్రధాన కారణం రిషబ్ పంత్ అద్భుత నైపుణ్యం కల యువ క్రికెటర్ అని నమ్మడమే. ఒక్కసారి అతను ఫామ్ లోకి వస్తే నిలకడగా పరుగులు సాధించగలడు. ఇక జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభమైన పని కాదు.పైగా వరుస వైఫల్యాలతో రిషబ్ పంత్ ఒత్తిడికి గురవుతున్నాడు. కానీ ఇలాంటి ఎదురుదెబ్బలే అతడిని మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దుతాయి’’ అని అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2019 తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుకు దూరమయ్యాడు.ధోనీ స్థానంలో గత జూలై నుంచి డిసెంబరు వరకు రిషబ్ పంత్‌కి వికెట్ కీపర్‌గా సెలక్టర్లు అవకాశం కల్పించారు.కానీ తనకు లెక్కకు మించి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో పంత్‌ విఫలమయ్యాడు.ఈ యువ ఆటగాడు బ్యాటింగ్,కీపింగ్ రెండిటిలోను అంచనాల మేరకు రాణించక నిరాశపరిచాడు.

ఈ ఏడాది ఆరంభం నుంచి కేఎల్ రాహుల్‌కి జట్టులో స్థానం లభించింది.సొంత గడ్డపై శ్రీలంక,ఆస్ట్రేలియా జట్లతో జరిగిన టీ-20,వన్డే సిరీస్‌లలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. అలాగే కివీస్ పర్యటనలో కేఎల్ రాహుల్ అంచనాలకు మించి బ్యాటింగ్‌లో మెరవడంతో పాటు కీపింగ్‌లోను ఆకట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలో పంత్‌కి బదులుగా కేఎల్ రాహుల్‌కి జట్టులో స్థానం కల్పించాలని మాజీ ఆటగాళ్ల నుండి అభిమానుల వరకు డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితిలో వికెట్ కీపర్‌గా జట్టు యాజమాన్యం తొలి ప్రాధాన్యత రిషబ్ పంత్‌ అని రాథోడ్ ప్రకటించడం ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

ఇక షెడ్యూల్ ప్రకారం ఆసీస్ గడ్డపై వచ్చే అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఐసీసీ టీ-20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది.ఈ టోర్నీకి ముందు జరగనున్న ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ ను నిరూపించుకొని ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాలని ధోనీతో పాటు రిషబ్ పంత్ కూడా ఆశించాడు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్-2020 సీజన్ వాయిదా పడగా ప్రపంచకప్‌ నిర్వహణపైన సందిగ్ధత నెలకొంది.