iDreamPost
android-app
ios-app

రేత్ సమాధి బుక్‌తో.. భారత రచయిత్రి గీతాంజలికి బుకర్ ప్రైజ్‌..

  • Published May 27, 2022 | 5:55 PM Updated Updated May 27, 2022 | 5:55 PM
రేత్ సమాధి బుక్‌తో.. భారత రచయిత్రి గీతాంజలికి బుకర్ ప్రైజ్‌..

భారత రచయిత్రి గీతాంజలి శ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదికపై ఒక్కసారిగా సంచలనం సృష్టించారు. ఆమె రాసిన ఓ నవలకు ఇంటర్నేషనల్ బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె 2018లో రాసిన రేత్‌ సమాధి పుస్తకం ‘టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌’గా ఇంగ్లీష్ లోకి అనువాదమయ్యింది. దీంతో ఆ ‘టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌’కి, దాని ఒరిజినల్ పుస్తకం రేత్ సమాధికి 2022కు గానూ ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ లభించింది.

టాంబ్‌ ఆఫ్ శాండ్‌ పుస్తకం బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ అనువాద పుస్తకం. గురువారం లండన్‌లో జరిగిన ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో గీతాంజలితో పాటు రేత్‌ సమాధిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ చేసిన అమెరికాకి చెందిన డైసీ రాక్‌వెల్‌ కు కలిపి ఈ గౌరవం అందించారు. బహుమతితో పాటు యాభై వేల బ్రిటిష్‌ స్టెర్లింగ్‌ పౌండ్లను క్యాష్‌ ప్రైజ్‌గా అందచేశారు.

రేత్‌ సమాధి అనే పుస్తకం ఉత్తర భారతంలో ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ. వృద్ధురాలు తన భర్త చనిపోతే తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి బయటకి వచ్చి ఆమె జీవితం ఏ విధంగా కొత్తగా మారుతుంది అనేదే ఈ నవలా కథ.

గీతాంజలి ఇప్పటివరకు అయిదు పుస్తకాలు రాసింది. ఈ అవార్డు వచ్చాక గీతాంజలి మాట్లాడుతూ.. బుకర్‌ ప్రైజ్ వస్తుందని కలలలో కూడా ఊహించలేదు. ఇది నేను సాధిస్తాను అనుకోలేదు. ఇది నాకు ఒక గొప్ప గౌరవం. అద్భుతంగా, గర్వంగా ఉంది అని తెలిపింది.

ఇక డైసీ రాక్‌వెల్‌.. అమెరికన్‌ రైటర్‌, ట్రాన్స్‌లేటర్‌గా, పెయింటర్‌గా పేరు తెచ్చుకుంది. ఉర్దూ, హిందీ నవలలను, రచలను ఆమె ఆంగ్లంలోకి అనువదించారు. ఈసారి బుకర్ ప్రైజ్ కోసం మొత్తం 135 పుస్తకాలను UKకు చెందిన ఈ అంతర్జాతీయ సాహిత్య వేదిక జ్యూరీ పరిశీలించగా చివరగా ఆరు పుస్తకాలు బుకర్‌ ప్రైజ్‌ కోసం పోటీ పడగా అందులో టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌కు ఈ గౌరవం దక్కింది.