iDreamPost
android-app
ios-app

ఇజ్రాయెల్‌లో యుద్ధ భయం.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

ఇజ్రాయెల్‌లో యుద్ధ భయం.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్లు విధ్వంసం సృష్టించారు. వేల కొద్ది రాకెట్లతో విరుచుకుపడి మెరుపు దాడులు చేస్తూ ఇజ్రాయెల్ ను అతలాకుతలం చేస్తున్నారు. రాకెట్ల దాటికి పలు భవనాలు నేలమట్టమై పలువురు మృతి చెందగా, వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హమాస్ మిలిటెంట్లు వీధుల్లో తిరుగుతూ ఇజ్రాయెల్ పౌరులపై కాల్పులకు తెగబడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. కాగా హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ లోని భారత ఎంబసీ అక్కడి భారత పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కాగా ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించింది. ప్రజలు బయటకు రావద్దని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు ఇళ్లలోంచి బయటకు రావొద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. అధికారులు సూచించిన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటించాలని సూచించింది. ఇజ్రాయెల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత పౌరులు సురక్షిత శిబిరాలకు దగ్గర్లో ఉండాలని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండి అని టెల్‌ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం తమ అడ్వైజరీలో పేర్కొంది.

కాగా ఆపరేషన్‌ ఐరన్‌ స్వార్డ్స్‌ పేరుతో హమాజ్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించింది ఇజ్రాయెల్. గాజాలోని హమాజ్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు ప్రారంభించినట్లు సైన్యం వెల్లడించింది. గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశం యుద్ధంలో హమాజ్ మిలిటెంట్లపై పోరాడుతుందని, తప్పకుండా విజయం సాధిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ పౌరులను, జాతి సంపదను రక్షించుకుంటామని వెల్లడించారు. దాడులకు ప్రతిఫలంగా హమాజ్‌ మిలిటెంట్లు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.