iDreamPost
android-app
ios-app

చైనీయుడ్ని రక్షించడానికి రిస్క్‌ చేసిన భారత కోస్ట్‌ గార్డ్‌.. నడి సంద్రంలో..

చైనీయుడ్ని రక్షించడానికి రిస్క్‌ చేసిన భారత కోస్ట్‌ గార్డ్‌.. నడి సంద్రంలో..

నడి సముద్రంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ చైనీయుడ్ని రక్షించడానికి ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ తీవ్ర శ్రమకు ఓడ్చింది. భారత అధికారులు ప్రాణాలకు తెగించి మరీ రెస్క్యూ ఆపరేషన్‌ చేశారు. నడి సముద్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అతడ్ని కాపాడారు. బుధవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన సముద్ర పరిశోధనా విభాగానికి చెందిన ఎమ్‌వీ డాంగ్‌ ఫాంగ్‌ కాన్‌ టాన్‌ సముద్రంలో చైనా నుంచి యూఏఈ వెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

అధిక ర​క్తపోటుతో పాటు కార్డియాక్‌ అరెస్ట్‌ లక్షణాలు ఉండటంతో బోటులోని వ్యక్తి ముంబైలోని ‘ది మారిటైమ్‌ రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌’కు వైర్‌లెస్‌ ద్వారా సమాచారాన్ని పంపాడు. సమాచారం అందిన వెంటనే భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు రంగంలోకి దిగారు. డాంగ్‌ను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్‌ను స్టార్ట్‌ చేశారు. చిమ్మ చీకటి, అనుకూలించని సముద్ర పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగారు. అరేబియా సముద్రంలో కొన్ని గంటల పాటు ప్రయాణించి.. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాంగ్‌ బోటును చేరుకున్నారు.

డాంగ్‌కు వెంటనే అత్యవసర చికిత్సను అందించారు. అనంతరం డాంగ్‌ను, డాంగ్‌తో పాటు మరో వ్యక్తిని బోటు నుంచి ముంబై తీరానికి తీసుకువచ్చారు. దగ్గరలోని ఆస్పత్రిలో డాంగ్‌ను చేర్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చైనీయుడ్ని రక్షించడానికి భారత కోస్ట్‌ గార్డ్‌ చేసిన సాహసంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. నెటిజన్లు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చైనాతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. సహాయం చేసే విషయంలో మాత్రం భారత్‌ది గొప్ప మనసంటున్నారు. మరి, చైనా వ్యక్తిని కాపాడేందుకు భారత కోస్ట్‌ గార్డ్‌ నిర్వహించిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.