iDreamPost
android-app
ios-app

లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్ మెన్ పంజా.. ఓటమిపాలైన కివీస్

లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్ మెన్  పంజా.. ఓటమిపాలైన కివీస్

ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 204 టార్గెట్ ను కోహ్లీ సేన ఛేదించి ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో బోణీ కొట్టింది.భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన టీమిండియాకు ప్రారంభంలో హిట్ మాన్ ఓపెనర్ రోహిత్ శర్మ(7) పరుగులకే స్పిన్నర్ సెంటర్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు.తర్వాత మొదటి స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ (32 బంతుల్లో 45;3×4, 1×6) కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 56;4×4,3×6) కలిసి రెండో వికెట్ కు మెరుపువేగంతో 52 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి పునాది వేశాడు. 8 బంతుల వ్యవధిలోనే రాహుల్,కోహ్లీ అవుట్ అవటం ఓవర్ కు దాదాపు 9 పరుగుల పైగా రన్ రేట్ సాధించాల్సిన పరిస్థితిలో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉండటంతో విజయంపై ఉత్కంఠ నెలకొంది.

బ్యాటింగ్ లో శివ తాండవం చేసిన అయ్యర్:

ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్ శివమ్ దుబే (13) కూడా త్వరగానే అవుట్ కావడంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది.గత మూడు సిరీస్‌లుగా నాలుగో స్థానంలో నిలకడగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్ (29 బంతుల్లో58 నాటౌట్: 5×4, 3×6) చెలరేగి ఆడి మ్యాచ్‌ ఫినిషర్ గా కూడా జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు.భారత్ విజయానికి ఆఖరి చివరి 5 ఓవర్లలో 53 పరుగులు అవసరంకాగా జట్టుని గెలిపించే బాధ్యత తీసుకున్న శ్రేయాస్ అయ్యర్ ఆఖరి వరకూ క్రీజులో ఉండి మనీశ్ పాండే (12 బంతుల్లో 14 నాటౌట్;1×6)తో కలిసి ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 
19 ఓవర్ చివరి బంతిని లాప్టెడ్ సిక్స్ కొట్టి మా జీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తుకు తెచ్చిన అయ్యర్ మ్యాచ్‌ని ఆరు బంతులు మిగిలి ఉండగానే ముగించేశాడు.

భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన న్యూజిలాండ్:

టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ను ఎంచుకుని లక్ష్య ఛేదనకు మొగ్గు చూపాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కివీస్ ఓపెనర్ కొలిన్ మున్రో (42 బంతుల్లో 59: 6×4, 2×6),గుప్తిల్(19 బంతుల్లో30) ఓవర్ కు సగటున 10 పరుగులు చొప్పున 80 పరుగులు సాధించి ఎనిమిదోవ చివరి బంతికి గుప్తిల్ శివమ్ దుబే బౌలింగులో అవుటయ్యాడు.కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ( 26 బంతుల్లో 51: 4×4, 4×6), రాస్ టేలర్ (27 బంతుల్లో 54 నాటౌట్: 3×4, 3×6) అర్థ సెంచరీలు సాధించడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత్ తరపున బౌలింగ్ చేసిన ఆరుగురు బౌలర్లు సమిష్టిగా విఫలం చెందారు.పేస్ బౌలర్లు మహమ్మద్ షమీ,శార్దూల్ ఠాకూర్ వరసగా ఓవర్కు 13,14 పరుగులు చొప్పున సమర్పించుకొని నిరాశపరిచారు.భారత బౌలర్లలో షమీ అందరూ తలో వికెట్ పడగొట్టారు.గత ఏడాది నుండి బ్యాటింగ్ కు అనుకూలించే సొంతగడ్డ పిచ్ లపై అద్భుతంగా రాణించిన భారత పేస్ దళం ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించే న్యూజిలాండ్ పిచ్లపై తేలిపోవడం ఆశ్చర్యకరం.