iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ చేతికే గోవా అంటున్న ఒపీనియన్ పోల్

కాంగ్రెస్ చేతికే గోవా అంటున్న ఒపీనియన్ పోల్

సరిగ్గా ప్రేమికుల దినోత్సవం రోజున జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కి ఊరట నిచ్చే విషయాన్ని ఇండియా టీవీ వెల్లడించింది.ఇప్పటివరకూ వెలువడిన సర్వేలన్నీ సముద్రతీర గోవాలో మరోసారి కమలం వికసించనున్నదని ప్రకటించాయి. కానీ అందుకు భిన్నంగా క్షేత్ర స్థాయి ఒపీనియన్ పోల్ అంటూ ఇండియా టీవీ తాజాగా వెల్లడించిన సర్వే వివరాలు కాక రేపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గోవా ప్రజలు గ్రాండ్ ఓల్డ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది.

ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ ప్రకారం గోవాలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవనుంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలలో హస్తం 17 నుంచి 21 సీట్లు హస్తగతం కానున్నాయని జోస్యం చెప్పింది. అలాగే తిరిగి అధికారం తమదేనని ధీమాతో ఉన్న బీజేపీ 14 నుంచి 18 సీట్లు గెలుస్తుందని సర్వే పేర్కొంది. ఇక ఆశల పల్లకిలో ఊగుతున్న టీఎంసీ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలకి చేదు ఫలితాలు దక్కే అవకాశం ఉన్నట్లు ఒపీనియన్ పోల్ తెలిపింది.టీఎంసీ – ఎంజీపీ కూటమి 2 నుంచి 4 సీట్లు,ఆప్‌కు సున్నా నుంచి 2 సీట్లు,ఇతరులు ఒక స్థానానికి పరిమితం కానున్నట్లు పేర్కొంది. ఇక ఓట్ల శాతం పరిశీలిస్తే బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్‌కు 32 శాతం, టీఎంసీ-ఎంజీపీకి 12 శాతం, ఆప్ 10 శాతం, ఇతరులకు 12 శాతం వచ్చే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్ లెక్క కట్టింది.

కాంగ్రెస్ కూటమికి దన్నుగా సౌత్ గోవా

దక్షిణ గోవాలో జీఎఫ్‌పీ (గోవా ఫార్వర్డ్ పార్టీ)తో పొత్తు కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురిపిస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. సౌత్ గోవాలో కాంగ్రెస్-జీఎఫ్‌పీ కూటమి 41 ఓట్ల శాతంతో అధికార పక్షానికి అందనంత దూరంలో నిలుస్తుందని ఇండియా టీవీ సర్వే ప్రకటించింది.ఆ ప్రాంతంలో స్థానాల పరంగా కాంగ్రెస్ కూటమి 10 నుంచి 12 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు ఒపీనియన్ పోల్ ఫలితాలు తెలుపుతున్నాయి. ఇక అధికార బీజేపీ 32 ఓట్ల శాతంతో 6 నుంచి 8 స్థానాలకు పరిమితం కానుంది. ఒకవేళ గోవా ఎన్నికల్లో ఆప్ ఖాతా తెరిస్తే అది ఈ ప్రాంతంలోనే అని సర్వే ప్రకటించింది. టీఎంసీ-ఎంజీపీ కూటమి 1 నుంచి 2 స్థానాలు సాధిస్తుందని,ఇతరులకు నిరాశే ఎదురు కానున్నదని ఇండియా టీవీ వెల్లడించింది.

కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 13 స్థానాలు మాత్రమే సాధించింది. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకొని అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ గోవాలో అధికారానికి కాంగ్రెస్ చేరువైనప్పటికీ అధిష్టానం సమయానికి స్పందించలేదు. ఇదే అదునుగా అవకాశాన్ని ఒడిసి పట్టిన బీజేపీ రాత్రికి రాత్రే అధికార పీఠంపై కొలువు తీరింది. 2017లో ముగ్గురు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు జీఎఫ్‌పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక ఎన్‌సీపీ ఎమ్మెల్యే మద్దతుతో మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి అయ్యారు.2019లో ఆయన మరణం తర్వాత ఆనాటి స్పీకర్ ప్రమోద్ సావంత్ అధికార పగ్గాలు చేపట్టారు.

ఇక సర్వే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ గోవా ప్రజల తీర్పు ఏమిటనేది మార్చి 10 న తేలనుంది.

Also Read : మ‌ణిపూర్ : బీజేపీ ఒంట‌రి పోరే.. గెలుపు అవ‌కాశాలు ఉన్నాయా?