కొత్త ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించేనా???

నేడు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వేదికగా భారత్, శ్రీలంకల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనున్నది. గత ఆదివారం రాత్రి గువాహటిలో తొలి టీ-20 మ్యాచ్ టాస్ వేయడం వరకే పరిమితమై వర్షం వల్ల రద్దు కావడంతో భారత అభిమానులు నిరాశ చెందారు. నూతన సంవత్సరము విజయంతో ప్రారంభించాలని భారత జట్టు కోరుకుంటుంది.

తొలి మ్యాచ్ కు ప్రకటించిన తుది జట్టే కొనసాగే అవకాశం ఉండటంతో యువ ఆటగాళ్లు రిజర్వు బెంచ్ కే పరిమితం కానున్నారు. జనవరి 14 నుండి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ లో ఓపెనర్ రోహిత్ శర్మ జట్టులో చేరనున్నాడు.

ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్పు జట్టుకు ఎంపిక కావడానికి, గాయం నుంచి కోలుకొని జట్టులో స్థానం సంపాదించిన ఓపెనర్ ధావన్ సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్లలో రాణించవలసి ఉంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో హోల్కర్ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదు కావచ్చు. ఈ మ్యాచ్ కి వర్షం గండం లేదని వాతావరణ శాఖ తెలపడంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోటీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

రికార్డుల పరంగా భారత్ దే పై చేయి:

భారత్ తో ఆడిన చివరి 10 మ్యాచులలో ఎనిమిదింటిలో శ్రీలంక ఓడిపోయి, ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. 2008 నుంచి విరాట్ కోహ్లీ ఆడిన ద్వై పాక్షిక సిరీస్ లలో ఇంతవరకు ఒక్కటి కూడా శ్రీలంక గెలవలేదు. 12 ఏళ్ల కాలంలో భారత్,శ్రీలంకల మధ్య 18 సిరీస్ లు జరగగా భారత్ 16 గెలవగా, 2 సిరీస్లు డ్రా అయ్యాయి.

భారత్ ఇప్పటివరకు హోల్కర్ స్టేడియంలో ఒకే ఒక టీ-20 మ్యాచ్ ఆడింది.ఆ మ్యాచ్ కూడా శ్రీలంక తోనే జరగడం విశేషం.టీ-20లో భారత్ అత్యుత్తమ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులను శ్రీలంకపై చేసింది. భారత్ వన్డేలలో అత్యధిక స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు 2011లో వెస్టిండీస్ పై ఇదే మైదానంలో నమోదు చేసింది.ఈ స్టేడియంలో జరిగిన 22 మ్యాచ్లలో 18 సార్లు రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి.

కోహ్లీ ముంగిట ప్రపంచ రికార్డులు:

శ్రీలంకతో జరిగిన గత వరుస నాలుగు టీ-20 మ్యాచులలో కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలు చేశాడు.ఈ మ్యాచ్లో కూడా అర్థ సెంచరీ చేస్తే ప్రత్యర్థిపై వరుసగా ఐదు అర్థసెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు.

2633 పరుగులు సాధించి రోహిత్ శర్మతో కలిసి ఉమ్మడిగా మొదటి స్థానంలో ఉన్న కోహ్లీ మరో ఒక్క పరుగు సాధిస్తే టీ-20 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు.అంతే కాక మరో 7 పరుగులు సాధిస్తే శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలుస్తాడు

ఇప్పటివరకు కెప్టెన్ గా 29 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 976 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్లో మరో 24 పరుగులు చేస్తే టీ-20 లలో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ గా రికార్డు సాధించడంతోపాటు,1000 పరుగులు సాధించిన ఆరో ఆటగాడిగా నిలుస్తాడు.

Show comments