iDreamPost
iDreamPost
కరోనా ఫోర్త్ వేవ్ సమయం దగ్గరపడిందా ? అంటే తాజాగా నమోదవుతున్న కేసులు నిజమేనన్నట్లుగా ఉన్నాయి. కొద్దిరోజులుగా దేశంలో రోజువారీ కేసులు 8 వేలకు పైగా నమోదవుతుండగా.. నేటి బులెటిన్ లో రోజువారీ కేసులు 12వేలకు పైగా నమోదయ్యాయి. ముందురోజుకంటే 38.4 శాతం అధికంగా కేసులు నమోదవ్వడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల మేరకు.. గత 24 గంటల్లో 5.19 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 12,213 మందికి పాజిటివ్ గా తేలింది.
ఇదే సమయంలో కరోనా నుంచి 7,624 మంది కోలుకోగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులతో కలిపి దేశంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరింది. 2022లో ఈ స్థాయిలో కేసులు ఫిబ్రవరి ఆఖరి వారంలో కనిపించాయి. మళ్లీ ఇప్పుడు కేసులు పెరగడంతో అందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో బయటపడ్డాయి. మహారాష్ట్ర -4024, కేరళ -3488 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాన్నలో ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. ఢిల్లీలో 1100 మందికి కరోనా నిర్థారణ అయింది. కాగా.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 58,215కి పెరిగాయి. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 195 కోట్ల టీకాలు పంపిణీ చేయగా.. నిన్న ఒక్కరోజే 15.21 లక్షల మంది టీకా తీసుకున్నారు.