నేటినుంచి భారత్ ఇంగ్లాండ్‌ల మధ్య జరగబోయే మూడో టెస్టుపై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రూపుదిద్దుకున్న మొతేరా మైదానంలో జరగబోయే మొదటి క్రికెట్ మ్యాచ్ ఇదే కావడం ఒక కారణం కాగా డేనైట్‌లో జరిగే టెస్ట్ కావడం, టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నిలిచే జట్టును డిసైడ్ చేసే టెస్టు మ్యాచు కావడంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి ఈ టెస్టుపై పడింది.
ఇప్పటికే భారత్ ఇంగ్లండ్ చెరో టెస్టును గెలుచుకుని టెస్టు సిరీస్ ను ఉత్కంఠ భరితంగా మార్చేసాయి. తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ డబుల్ సెంచరీ సాయంతో భారత జట్టును చిత్తు చేయగా రెండో టెస్టులో స్పిన్ ఉచ్చులో ఇంగ్లాండ్ జట్టును బిగించి భారత్ సంచలన విజయం సాధించింది. మూడో టెస్టులో విజయం సాధించిన జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరనుంది. దీంతో ఈ టెస్టుకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మకు ఇది వందో టెస్టు కావడం గమనార్హం.
కోహ్లీ శతక్కొట్టేనా?
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతమున్న అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 2019 అనంతరం గత 34 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ శతకాన్ని సాధించలేదు. 2019 లో ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో జరిగిన డేనైట్ టెస్టులో కోహ్లీ శతకం సాధించాడు. ఈ డేనైట్ టెస్టులో అయినా కోహ్లీ శతక దాహాన్ని ఈ డేనైట్ టెస్టులో తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రోహిత్,శుభమన్ గిల్,రహానే బ్యాటు ఝళిపించాల్సిన అవసరం ఉంది. గత టెస్టులో స్పిన్ పిచ్ పై విఫలమైన కుల్దీప్ యాదవ్ కి జట్టులో చోటు దక్కకపోవచ్చు. బుమ్రా పునరాగమనం జట్టుకు బలం చేకూర్చనుంది. బుమ్రా రాకతో సిరాజ్ జట్టుకు దూరం కానున్నాడు. వందో టెస్టు ఆడబోతున్న ఇషాంత్ శర్మ కపిల్ దేవ్ (131) తర్వాత వంద టెస్ట్ మ్యాచులు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
బలోపేతం కానున్న ఇంగ్లీష్ జట్టు..
ఇంగ్లండ్ జట్టులో బెయిర్‌స్టో, అండర్సన్, ఆర్చర్, క్రాలీలు జట్టులోకి తిరిగి రానున్నారు. జాక్ క్రాలీ, బెయిర్‌స్టో జట్టులోకి వస్తున్న నేపథ్యంలో బర్న్స్ & లారెన్స్ తుది జట్టుకు దూరం కానున్నారు. అగ్రశ్రేణి పేసర్లయిన అండర్సన్, ఆర్చర్ జట్టులోకి పునరాగమనం చేయడంతో ఇంగ్లాండ్ పేస్ దళం భీకరంగా కనిపిస్తుంది. స్టువర్ట్ బ్రాడ్ కి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మొతెర పిచ్ పేసర్లకు అనుకూలిస్తే భారత బ్యాట్స్‌మెన్‌కు వారిని ఎదుర్కోవడం కష్టమే అని చెప్పవచ్చు..
ఆకర్షిస్తోన్న నూతన మైదానం
1982 లో అహ్మదాబాద్ లో నిర్మించిన మొతేరా మైదానం గతంలో పలు అంతర్జాతీయ మ్యాచులకు ఆతిధ్యం ఇచ్చింది. దీన్ని సర్దార్ పటేల్ స్టేడియం అని కూడా పిలుస్తారు. ఆగస్టు 19, 2017 వరకు 12 టెస్టులు, 23 వన్డేలు మరియు ఒక టి 20 ఇంటర్నేషనల్ మ్యాచుకు ఆతిధ్యం ఇచ్చింది. కాగా అత్యంత పెద్దదైన అధునాతన మైదానంగా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన పునర్నిర్మాణ పనులు 2016 లో ప్రారంభించింది. 63 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ నూతన మైదానంలో మూడు ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. 76 కార్పొరేట్ బాక్స్‌లు కలిగి ఉన్న ఈ స్టేడియంలో ఒక్కో కార్పొరేట్ బాక్స్ లో 25 కార్పొరేట్ సీట్లు ఉన్నాయి. నాలుగు డ్రెస్సింగ్ రూములతో పాటు ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఫ్లడ్ లైట్లకు బదులు LED లైట్లను ఉపయోగించారు.
మొతేరా మైదానంలో జరిగే మ్యాచులను 110,000 మంది చూడొచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కాగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రీడా మైదానం. ఉత్తర కొరియాలోని ప్యాంగ్యాంగ్‌లోని రుంగ్రాడో మే డే స్టేడియంలో 114,000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరు పొందింది.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంలో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ పింక్ బాల్ టెస్టుపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. నేటి మధ్యాహ్నం 2.30 నుండి మొదలుకాబోతున్న ఈ మహా సమరాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.