iDreamPost
android-app
ios-app

Viral News, MP పంచాయితీకి మహిళలు ఎన్నికైతే, భ‌ర్త‌లు, బావ‌ల ప్రమాణ స్వీకారం

  • Published Aug 06, 2022 | 4:51 PM Updated Updated Aug 06, 2022 | 4:51 PM
Viral News, MP పంచాయితీకి మహిళలు ఎన్నికైతే, భ‌ర్త‌లు, బావ‌ల  ప్రమాణ స్వీకారం

మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన కొందరు మహిళా పంచాయతీ ఆఫీస్ బేరర్లు, సభ్యుల ప్ర‌మాణ స్వీకారం జ‌రిగింది. ఆశ్చ‌ర్యం. మ‌హిళా స‌భ్యులెవ‌రూ రాలేదు. బ‌దులుగా, వాళ్ల భ‌ర్త‌లు, బావ‌లు, మగ బంధువులతో ప్రమాణం చేయించారు.

సాగర్, దామో జిల్లాల్లోని కొన్ని చోట్ల గురువారం కొందరు మహిళల భర్త‌లు, తండ్రులతో పాటు మగ బంధువులు ప్రమాణ స్వీకారం చేశారు. భార్య‌ల‌కు బ‌దులు భ‌ర్త‌ల‌ ప్రమాణ స్వీకారం వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ‌డంతో, గ‌గ్గోలు పుట్టింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఇదేమీ కొత్త కాదు. చాలాసార్లు రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం మ‌హిళ‌లు పోటీచేస్తారు. గెలుస్తారు. కాని వాళ్లు ప్ర‌మాణ స్వీకారం చేయ‌రు. అంతేకాదు, వాళ్లు సంత‌కాలు మాత్ర‌మే పెడ‌తారు. అధికారాలు మాత్రం భ‌ర్త‌లు, బావ‌ల‌దే.

ఇలా భర్తలు, బావ‌లు, మహిళ స‌భ్యుల‌ తండ్రులు ప్రమాణ స్వీకారం చేశారన్న ఆరోపణలపై జైసీనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆశారాం సాహును సస్పెండ్ చేశారు.

సస్పెండ్ అయిన‌ సాహు మీడియాతో మాట్లాడాడు. ప్ర‌మాణ స్వీకారానికి హాజరు కావాలని పదేపదే కోరినా మహిళా స‌భ్యులు అటెండ్ కాలేదు. బదులుగా వారి తరపున, వారి బంధువులను పంపించారు. అందుకే వాళ్ల‌ కుటుంబంలోని మగ సభ్యులు ప్రమాణం చేయడానికి అనుమతించామ‌ని చెప్పాడు.

జైసీనగర్ గ్రామ పంచాయతీలో ఎన్నికైన 10 మంది మహిళల్లో ఒకరి తండ్రి, మరో ఇద్దరి భర్తలు, ఎన్నికైన సభ్యుల స్థానంలో, మరో మహిళ బావ ప్రమాణం చేశాడు. ఇదేమీ ఒక్క గ్రామ‌పంచాయితీకి సంబంధించిన వ్య‌వ‌హారం కాదు.

దమోహ్ జిల్లాలో, గైసాబాద్, పిపారియా కిరౌ గ్రామ పంచాయతీలలో మ‌గాళ్లు ప్రమాణ స్వీకారం చేశారని ఆరోపణలు వచ్చాయి, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ S కృష్ణ చైతన్య చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఎన్నికైన మహిళా సభ్యుల స్థానంలో, భ‌ర్త‌లు, తండ్రులు ప్రమాణ స్వీకారం చేశారన్న సమాచారంపై నివేదికలు కోరారు. ఆ త‌ర్వాత‌ సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై తదుపరి చర్యలు తీసుకొంటారు.

ఎన్నికైన మహిళా పంచాయతీ ఆఫీస్ బేరర్ల స్థానంలో మ‌గ కుటుంబీకులు ప్రమాణం చేయించిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జరిగాయి.