iDreamPost
iDreamPost
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం సమస్యను ఎత్తిచూపడానికి అస్సాంలోని నాగాన్ టౌన్ లో ‘పార్వతీ దేవి ‘శివుడు’ వీధి నాటకం వేశారు.
అయితే, నాటకం నచ్చలేదో కాని, శివుడి వేషం వేసిన వ్యక్తిని లోకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేంటి వీధినాటకమేస్తే అరెస్ట్ చేస్తారా అని అడిగితే? శివుడి వేషం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయంట.
శివుని వేషధారణలో ఉన్న నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ నాటకమేసిన మరో ఇద్దరిని ఇంకా ఇంకా పట్టుకోలేదు” అని సదర్ PS ఇంచార్జి మనోజ్ రాజవంశీ అంటున్నారు.
ఇదేమీ మతపరమైన నాటకంకాదు. శివుడి మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ధరల పెరుగుదల మీద వేసిన నాటకం. ద్రవ్యోల్బణంతో సామాన్యుడి దుస్థితిని హైలైట్ చేయడానికి ఈ నాటకమేశారు.
హిందూ దేవుణ్ణి , దేవతలను చెడ్డగా చూపించారని, అలా చేసే స్వేచ్ఛ వాళ్లకు లేదంటూ విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ వంటి సంస్థలు నటుడిపై కేసులు పెట్టాయి. ఇంకేముంది, పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల మతపరమైన మనోభావాలు మరీ సున్నితంగా తయారవుతున్నట్లున్నాయి. దేశంలో ప్రతిచోటా హిందూదేవుళ్లను కించపరుస్తున్నారంటూ పెడుతున్న కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వ్యక్తిగత గొడవలు, రాజకీయాలు కూడా ఇలాంటి కేసుల్లో కొన్నింటికి కారణమవుతున్నాయి.
‘కాళి’ డైరెక్టర్ లీనా మణిమేకలైపై కేసులు పెట్టారు. ఆమె డాక్యుమెంటరీ పోస్టర్ లోమహిళ కాళీమాత వేషధారణలో ధూమపానం చేస్తున్నట్లుగా ఉంది. LGBT ఇంద్రధనస్సు జెండా నేపథ్యంలో ఉంది. వివాదం రేగడంతో పోస్టర్ ట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది.
కెనడాకు చెందిన సినీ నిర్మాత లీనా మణిమేకలైపై, ఢిల్లీ, అస్సాం, యూపీతో సహా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మతపరమైన మనోభావాలను దెబ్బతీసారనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.