మరో 4 రోజులు భారీ వర్షాలు.. కుంభవృష్టి కురిసే అవకాశం

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో నాలుగు రోజులు పాటు.. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఏపీలోని 18 జిల్లాలకు, అలాగే తెలంగాణలోని 6 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నందున.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు మాత్రమే కాక.. అకస్మాత్తుగా అక్కడక్కడ కుంభవృష్టి కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుమధ్య బంగాళాఖాతంలోని ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో వాయువ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ కొత్తగూడెం, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక నేటి నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు.

Show comments