iDreamPost
iDreamPost
పేరుకే ఆయన జిల్లా కలెక్టర్.. ఆయన చేస్తున్న పనులు మాత్రం చెత్త తీసే కార్మికుడి దగ్గర నుంచి మొదలవుతాయి.. అందుకే సామాన్యుల నుంచి సాటి ఐఎఎస్‌ల వరకు అందరికీ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు రోజుకోకొత్త పని చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. మొన్న అందరికీ విజ్ఞప్తి అంటూ ఆత్మగౌరవంతో మీ సమస్యలను తెలియజేయండని ప్రజలకు అర్థమయ్యేలా ఓ పోస్టర్‌ను ప్రభుత్వ కార్యాలయాల్లో అతికించేశారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ కలెక్టర్‌పై ప్రశంశల వర్షం కురిపించారు. ధైర్యంగా సమస్యలు చెప్పుకోవాలని కలెక్టరే స్వయంగా చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇప్పుడు మరోసారి గంధం చంద్రుడు వార్తల్లోకెక్కారు. అనంతపురం వీధుల్లో చీపురుపట్టి రోడ్లు ఊడ్చుతున్నారు. మన నగరాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలంటూ మన అనంత..సుందర అనంత అనే కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు కూడా రోడ్లను శుభ్రం చేశారు. ప్రతి శనివారం నగరంలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఉగాది పండుగ లోపు అనంతపురం పరిశుభ్రమైన నగరంగా ఉండాలన్నదే కలెక్టర్ లక్ష్యం.
గంధం చంద్రుడు అనంతపురం జిల్లా కలెక్టర్ మాత్రమే కాదు అనంతపురం మున్సిపాల్ కార్పోరేషన్‌కు ప్రత్యేక అధికారి కూడా. అందుకే ఆయన కార్పోరేషన్‌లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. నగరంలో చెత్త చెదారం ఎక్కడపడితే అక్కడ ఉండకుండా 60 రోజుల ప్రణాళికతో నగరాన్ని సుందరంగా మార్చేందుకు కృషిచేస్తున్నారు. ప్రతిశనివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పారిశుధ్యపనులు చేయనున్నారు. స్వయాన జిల్లా కలెక్టరే ఈవిధంగా పారిశుద్య పనులు చేస్తుండటంతో అధికారులు, ప్రజలు కూడా ఈ పనుల్లో స్వచ్చందంగా భాగస్వాములు అవుతున్నారు.
నగరంలో అభివృద్ధి పనులు రూ. 60 కోట్లతో చేపట్టనున్నారు. ప్రధాన రోడ్లతో పాటు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించనున్నారు. డివైడర్లు, ప్రహారీ గోడలను సుందరంగా రంగులతో అలంకరించనున్నారు. అనంతపురం గుర్తొస్తే పచ్చదనం కనిపించేలా మార్పలు చెయ్యనున్నారు. అనంతపురంలో కలెక్టర్ గంధం చంద్రుడు తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలు ప్రజలు మెచ్చేలా ఉన్నాయి. మున్ముందు కూడా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అనంతవాసులు కోరుకుంటున్నారు.