ఇకపై టెన్త్‌లో ర్యాంకులు మావే అంటూ ప్రకటనలు చేస్తే జైలుకే.. ఆ స్కూల్స్‌కి హెచ్చరిక..

టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడినప్పుడు చాలా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ తమ విద్యార్థులకే ర్యాంకులు వచ్చాయని, తమ విద్యార్థులకే ఎక్కువ మార్కులు వచ్చాయని అధిక ప్రకటనలు చేస్తూ ఉంటారు. టీవీల్లో, పేపర్స్ లో, బ్యానర్స్ పై ఇలా రకరకాలుగా ప్రమోషన్ చేస్తారు. గతంలోనే ఇలాంటి యాడ్స్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఇలా ప్రకటనలు జారీ చేస్తే జైలు శిక్ష తప్పదని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేస్తూ హెచ్చరించింది.

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై మా విద్యార్థులకే ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలు ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏపీ విద్యాశాఖ హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా SSC పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తాజాగా 83వ నంబరు జీవోని జారీచేశారు.

ఈ జీవో ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మా విద్యార్థులకే ర్యాంకులు, ఉత్తమ మార్కులు అంటూ ప్రకటనలు చేస్తే ఆ సంస్థల యాజమాన్యాలు, దానికి సంబంధించిన వారికి మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారని తెలిపారు. ఈ జీవోని రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ కి పంపించారు. ర్యాంకులతో ప్రకటనలు చేయరాదని, విద్యాసంస్థలు ఏ రూపంలోనూ, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేసినా వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Show comments