iDreamPost
android-app
ios-app

హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ట్రైన్.. పూర్తి వివరాలివే

హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ట్రైన్.. పూర్తి వివరాలివే

దేశ రైల్వే వ్యవస్థ అత్యాధునికతతో పాటు వేగవంతంగా నడిచే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. పెరుగుతున్న రద్దీ, సమయ లేమీ, ఇతర కారణాల దృష్ట్యా ఈ రైళ్లకు మంచి ఆదరణ లభించింది. చార్జీల ధరలు ఎక్కువైనా.. వేగవంతం, సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో 25 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరో 9 రైళ్లను తీసుకురాబోతుంది. ఈ నెల 24 అనగా ఆదివారం నాడు ఈ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీ నుండి వర్చువల్ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొత్తగా లాంచ్ కాబోతున్న రైళ్లతో  దేశంలో మొత్తం 34 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.

కాగా, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్ నుండి విశాఖ పట్నం, సికింద్రాబాద్ నుండి తిరుపతికి రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రారంభించబోయే 9 వందే భారత్ రైళ్లలో ఒకటి తెలంగాణ నుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య ఈ రైలు నడవనుంది. ఇప్పటికే కాచిగూడ-యశ్వంతపూర్ మధ్య నడిచే ఈ వందే భారత్ ట్రైన్ బుక్సింగ్ ప్రారంభం అయ్యాయి. ఐఆర్సీటీసీలో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. బుధవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. కాచిగూడ నుండి ఉదయం 5.30 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్ పూర్(బెంగళూరు) జంక్షన్ చేరుకుంటుంది. గతంలో ఈ రూట్ లో ప్రయాణించాలంటే కనీసం 12 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు 610 కిలోమీటర్ల దూరాన్ని 8.30 గంటల్లో చేరుకోవచ్చు.

ఇది మహబూబ్ నగర్, కర్నూల్ సిటీ, అనంతపురం, ధర్మవరం జంక్షన్ స్టేషన్లలో ఆగుతుంది. ఇక చార్జీల వివరాలకు వస్తే.. కాచిగూడ నుండి యశ్వంత్ పూర్ (ట్రైన్ నంబర్ 20704) ఏసీ చైర్ కార్ టికెట్- రూ. 1600 (కేటరింగ్ చార్జీలు రూ. 364), ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్ ధర రూ. 2915 (క్యాటరింగ్ చార్జీలు రూ. 419 కలిపి)గా ఉన్నాయి. యశ్వంత్ పూర్ నుండి చూస్తే మధ్యాహ్నం 2.45 నిమిషాలకు బయలు దేరి.. అదే రోజు రాత్రి 11.15 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఏసీ చైర్ కార్ ధర రూ. 1540గానూ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ. 2865గానూ రైల్వే శాఖ నిర్ణయించింది. క్యాటరింగ్ చార్జీల్లో వ్యత్యాసం కారణంగా తిరుగు ప్రయాణంలో రైలు చార్జీల్లో తగ్గుదల నమోదైంది.ఈ రైలు రోజూ తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో 12 జిల్లాల నుంచి వెళ్తుంది. ఈ రైలు యావరేజ్ స్పీడ్ గంటకు 71.74 కిలోమీటర్లు. ఈ రైలులో ఎనిమిది కోచ్ లు (7 ఏసీ చైర్ కార్, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్) ఉండనున్నాయి. ఇందులో 530 మంది ప్రయాణించవచ్చు.