Idream media
Idream media
హుజూరాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక పార్టీపై మరోపార్టీ విమర్శలు చేసుకోవడంలో మించిపోతున్నాయి. ఇక్కడ ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉన్నప్పటికీ అప్పుడుప్పుడు కాంగ్రెస్ కూడా పైకి లేస్తోంది. గెలుపు కోసం కాకపోయినా కనీసం ఉనికి చాటాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారంలో నేరుగా పాల్గొనలేదు. ఎన్నికల నేపథ్యంలో సభ పెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ సందర్భంగా కనిపించిన రేవంత్ ఆ తర్వాత ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్పా నేరుగా ప్రచారంలో పాల్గొనలేదు. అభ్యర్థి వెంట దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మినహా మిగతా సీనియర్ నేతలు ఎక్కువగా కనిపించడం లేదు. తాజాగా జూమ్ మీటింగ్ ద్వారా అక్కడి నేతలతో సమావేశమైన రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా ఒకే ప్రాతిపదికన స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే అని టీఆర్ఎస్ అంటే.. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చెబుతోంది. ఏదో రకంగా తమ వాయిస్ వినిపించుకునే తపనలో ఇరు పార్టీల నాయకులూ మాట్లాడుతుండడం వినేవాళ్లకు విచిత్రంగా అనిపిస్తోంది. బీజేపీ,కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని మంత్రి కేటీఆర్ ఇటీవల మీడియాతో చిట్ చాట్ సందర్భంగా చెప్పారు. అందుకే ఆ పార్టీ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని అన్నారు. ఓ ఏడాది తర్వాత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదని చెప్పారు. ఈటెలకు ఓటేస్తే సిలిండర్ ధర తగ్గిస్తారా, పెట్రోల్, డీజిల్ ధర తగ్గిస్తారా అని ప్రశ్నించారు. వెయ్యి నామినేషన్లు వేయిస్తామన్నవారు ఎక్కడికి వెళ్లారని హుజూరాబాద్‌లో వంద శాతం టీఆర్ఎస్‌దే గెలుపని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.
హుజూరాబాద్ ఎన్నికల్లో ఇంటికో ఓటును కాంగ్రెస్‌కు వేసే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ నేతలు, హుజూరాబాద్ ఎన్నికల ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలతో రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు. వచ్చే వారం రోజులపాటు అనుసరించాల్సిన ప్రచారవ్యూహాలపై నాయకులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మోసపూరిత విధానాలు వివరించాలన్నారు. బీజేపీ–టీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందాలు బయటపెట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యూహాలను అమలు చేయాలని హుజూరాబాద్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
మరోవైపు నియోజకవర్గ బాధ్యతలు వహించిన హరీశ్ రావు కూడా దూకుడు పెంచారు. ప్రజల్ని మభ్యపెట్టి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసేలా అందంగా మాట్లాడుతున్న బీజేపీ నేతలకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యాలకు ప్రచారంలో భాగంగా గురువారం కౌంటర్ ఇచ్చారు. రైతులకు పంగ నామాలు పెట్టిన ఎంపీ అరవింద్ హుజూరాబాద్‌కు వచ్చి నీతులు చెప్తారా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చి మోసంచేసిన అరవింద్‌తో మేము నీతులు చెప్పించుకోవాలా అన్నారు. బాండ్ పేపర్ అరవింద్ చెప్తే హుజూరాబాద్ ప్రజలు నమ్ముతారా అని వ్యాఖ్యానించారు. ఎందుకోసం బీజేపీకి ఓట్లు వేయాలో చెప్పాలన్న హరీశ్ హుజూరాబాద్ ప్రజలారా బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దని సూచించారు. ఎన్నికలు దగ్గరికి వచ్చేకొద్దీ ఇలా ఒకరికొకరు ప్రచారంలో వేడి పెంచుతున్నారు.
Also Read : Huzurabad Aravind ,Kavita -హుజూరాబాద్ : నిజామాబాద్ ఎన్నికను తలపిస్తున్న అరవింద్ ప్రచారం