Idream media
Idream media
అది 2003. నేను పదో తరగతి చదవుతున్న రోజులు. క్రికెట్‌పై ఇష్టంతో ఆరో తరగతి నుంచే పేపర్ చదివేవాడిని. అప్పట్లో పత్రికల్లో వెనుక పేజీలో క్రీడా వార్తలు ప్రచురించేవారు. మా ఊరికి వార్త పత్రిక వచ్చేది. వెనుక నుంచే నా పత్రిక పఠనం ప్రారంభం అయ్యేది. మొదట కేవలం వెనుకపేజీ మాత్రమే. ఆ తర్వాత మెల్లగా ఇతర పేజీలు చూసేవాడిని. కరువు వార్తలు నిత్యం కనిపించేవి.
మా ప్రకాశం జిల్లా కరువు ప్రాంతం. అందులోనూ మా కనిగిరి పూర్తిగా వర్షాధార ప్రాంతం. వెలిగొండ శంకుస్థాపన ఫలకం మా బతుకులను వెక్కిరిస్తూ ఉండేది. వానల (వర్షం)పై ఆధారపడే తోటల్లో వరి పంట వేస్తాం. చేనుల్లో కంది, పొగాకు పంటలు వేస్తాం. కాలం కలసి రాక, పంటలు పండేవి కావు. కరువు వద్దన్నా ప్రతి ఏడాది పలుకరించేది.
కరెంట్ బిల్లులు కట్టేందుకు కూడా రైతుల వద్ద డబ్బులు ఉండేవి కావు. బిల్లులు కట్టించుకునేందుకు ప్రతి నెలా మొదట్లో కరెంటోళ్లు ఊర్లలోకి వచ్చేవారు. వారు వచ్చారనే వార్త తెలియగానే.. చాలా మంది రైతులు ఇళ్ల వద్ద ఉండేవారు కాదు. ఇంటి వద్ద ఉంటే బిల్లులు కట్టాలని గొడవ చేస్తారు. వారి నుంచి తప్పించుకునేందుకు పని లేకపోయినా పొలం వెళ్లి కరెంటోళ్లు పోయిన తర్వాత వచ్చేవారు. ఊరి పక్కనే ఉన్న తోటల్లోకి వెళ్లి.. బిల్లులు కట్టని వారి మీటరు, వైర్లు కరెంటోళ్లు తీసుకెళ్లిపోయేవారు. టీడీపీ వాళ్లకు కూడా మినహాయింపు ఏమీ లేదు.
Also Read:గెలిచే కాదు ఓడిపోయి రికార్డ్ సృష్టించొచ్చు ,ఎలానా?
వర్షాలు సరిగా పడకపోవడంతో మా ప్రాంతంలో తిండి గింజలకు కొరతే. కోటా (రేషన్) బియ్యం, మిరగాయిచారు, పున్నీళ్లతో పొట్టనింపుకునేవాళ్లు. కందిపంట చేతికొచ్చేది కాదు. వాణిజ్య పంట అయిన పొగాకు దిగుబడి తగ్గిపోయేది. పండిన ఆ కాస్త పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర వచ్చేది కాదు. పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పులు మీద పడ్డాయి. మాకేరును నమ్ముకుని ఆత్మహత్యలు చేసుకోవడం కన్నా వలస పోవడం మేలని కుటుంబంతో సహా దేశం పోయేవాళ్లం. అప్పులు తీర్చే మార్గం కానరాని రైతులు బడికి పోయే తమ పిల్లలను దేశం పంపేవారు. కన్నీరు కనురెప్ప కింద ఆపుకుని ఆరు, ఏడో తరగతి చదివే బిడ్డలను చదువు మాన్పించి హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో బేల్దారి పనులకు, బళ్లారి, కర్నూలు నగరాల్లోని బరుగుల బట్టీలలో పనులకు పంపేవారు.
ముక్కుపచ్చలారని పిల్లలు ఆటలు, చదువులు మానేసి కుటుంబ అప్పుల బాధ్యత మోస్తూ మేస్త్రీలు, బరుగుల బట్టీల యజమనాలతో నగరాలకు పోయేవాళ్లు. భోజనం పెట్టి ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చేవారు. సిమెంట్ పనిలో మూడు, నాలుగేళ్లు పై మనిషి (సిమెంట్, ఇసుక కలిపి అందించేవారు)గా చేసిన తర్వాత మేస్త్రి ( గోడ కట్టేవాళ్ళు ) అయ్యేవారు. అప్పుడు ఏడాది జీతం 15 వేల రూపాయలు ఉంటుంది. నా జూనియర్లు, సీనియర్లు, సూపర్ సీనియర్లు చాలా మంది ఆ పనికి తప్పక వెళ్లాల్సి వచ్చింది. చంద్రబాబు హయాంలో కరువుకు నేను కూడా బాధితుడినే.
ఓ పక్క కరువు పరిస్థితులు, మరో పక్క ప్రభుత్వం ఆదుకునే చర్యలు లేకపోవడంతో.. 1999 –2003 మధ్య రైతులు, రైతు కూలీల బిడ్డలు చదువుకు దూరం అయ్యారు. ఆరో తరగతిలో 50 మంది విద్యార్థులున్న మా క్లాస్‌లో పదో తరగతి వచ్చేసరికి కేవలం 11 మందిమి మిగిలాం. అందులో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. అప్పట్లో పదో తరగతి తర్వాత.. ఇంటర్, ఆ పైచదువులు చదవే స్థోమత ఊర్లలోని ఒకట్రెండు కుటుంబాలలోని పిల్లలకు మాత్రమే ఉండేది. 2002, 2003లో మా కనిగిరి (ప్రకాశం జిల్లా) లోని ఇంటర్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజులన్నీ కలిపి పది వేల రూపాయలు. ఈ మొత్తం కట్టే శక్తిలేక పదో తరగతితోనే చదువులు ఆపేసేవాళ్లు. ఒక వేళ ఇంటర్ చేరినా.. ఆర్థిక సమస్యలతో మధ్యలోనే మానేసే పరిస్థితులు తలెత్తేవి.
Also Read:ప్రజల మనిషి వైఎస్సార్
ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చింది. కరువు పోతుందని, రైతు కష్టాలను ఎరిగిన రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయితే బతుకులు బాగుపడతాయని టీడీపీ వాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. బాబు హయాంలో కనుమరుగైన వాన.. వైఎస్ ముఖ్యమంత్రి అవగానే వచ్చింది. సకాలంలో పుష్కలంగా వర్షాలు. తిండి గింజలకు దిగ్గుల్లేదు. కంది, పొగాకు పంటలు బాగా పండాయి. మంచి గిట్టుబాటు ధరలు వచ్చాయి. ఉచిత విద్యుత్ అందింది. పెట్టుబడికి అప్పుచేసే అవసరం లేకుండానే పావలా వడ్డీకి బ్యాంకు రుణాలు వైఎస్ ప్రభుత్వం అందించింది. పంట చేతికి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో తిరిగి బ్యాంకు అప్పు తీర్చేవారు రైతులు.
2004, 2005, 2006 ఏడాదికి వచ్చే సరికి మా కష్టాలు తీరాయి. 2004 నాటికి మా ప్రాంతంలో 90 శాతం మంది రైతులు అప్పుల్లో ఉండేవారు. 2006 ముగిసే సమయానికి 90 శాతం మంది రైతుల అప్పులు తీరాయి. నాలుగు రూపాయలు మిగిలాయి. 2009లో చేసిన రుణమాఫీ వల్ల ఆ పది శాతం మంది కూడా అప్పుల నుంచి బయటపడ్డారు.
ఎప్పుడైతే కాలం బాగా అయిందో.. అప్పటి నుంచి మా ప్రాంతంలో పదో తరగతి తర్వాత కూడా పిల్లలను చదివించే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2005 తర్వాత బడికి వెళ్లే పిల్లలను చదువు మాన్పించి.. బేల్దారి పనులకు, బరుగులు బట్టీలలో పనులకు పంపడం పూర్తిగా తగ్గిపోయింది. పదో తరగతి తర్వాత ఇంటర్‌లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2007లో వైఎస్సార్ ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం పెట్టడడంతో ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారం ఏర్పడింది.
Also Read:రామోజీరావు ఒక ఉద్యోగికి ఉత్తరం రాయటమా?మార్పా?లేక సోషల్ మీడియా ఎఫెక్ట్?
ఇప్పటికీ మా ప్రకాశం జిల్లా కరువు ప్రాంతమే. అందులోనూ మా కనిగిరి, మార్కాపురంలు వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలే. వైఎస్ రాకతో ఆ ప్రాజెక్టుకు ఓ రూపం వచ్చింది. ఇటీవల ఒక సొరంగం పూర్తయింది. రెండో సొరంగం కూడా మరో ఒకట్రెండు ఏడాదుల్లో పూర్తవుతుందంటున్నారు. శ్రీశైలం మల్లికార్జునుడి పాదాల చెంత నుంచి కొండల భూగర్భాలను చీల్చుకుంటూ నల్లమల అడవుల గుండా వెలిగొండ ద్వారా వచ్చే కృష్ణమ్మ మా నేలను తడిపే రోజు కోసం ఎదురుచూస్తున్నాం.
2014– 2019 మధ్య బాబు హాయంలో మళ్లీ తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినా మా జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా.. పిల్లలు ఉద్యోగాలు చేస్తుండడంతో వ్యవసాయంలో వచ్చే నష్టాల నుంచి రైతు కుటుంబాలు సులువుగా బయటపడుతున్నాయి. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం ఫలాలు ఎలాంటివో ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలలోని జీవితాలను పరికించి చూస్తే సులువుగా అర్థం చేసుకోవచ్చు.
– దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్థంతి సందర్భంగా..