Box Office : 2022 బాక్సాఫీస్ బోణీ ఎలా ఉండబోతోంది

2022 మొదలయ్యింది కానీ ఓపెనింగ్ మాత్రం ప్రేక్షకులకు చప్పగా ఉంది. కారణం ఆర్ఆర్ఆర్ వెనక్కు పోవడం ఒకటైతే ఒక్కటంటే ఒక్కటీ భారీగా చెప్పుకునే సినిమా ఈ మొదటి శుక్రవారం రాకపోవడం. జనవరి 7 ఫస్ట్ ఫ్రైడే ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు చిత్రాలు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాయి. ఇందులో ఏదైనా ఉదయం ఆట హౌస్ ఫుల్ బోర్డు పడినా గొప్పే అనుకోవచ్చు. అంత బజ్ లేకుండా బరిలో దిగుతున్నాయి. ఎప్పడో నిర్మాణం పూర్తి చేసుకుని హీరో రానానే ఆశలు వదులుకున్న 1945 మొదటి ఛాయస్ గా చెప్పుకోవచ్చు. కానీ తను కనీసం డబ్బింగ్ చెప్పుకోలేదు. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ట్వీట్లు వెయ్యడం లేదు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రానాకే లేని ఆసక్తి ప్రేక్షకులకు ఎక్కడి నుంచి వస్తుంది. ఆది సాయికుమార్ అతిథి దెవొ భావ రెండో ఆప్షన్. లవ్లీ తర్వాత కనీస హిట్టు లేక ఇబ్బంది పడుతున్న ఆదికి ఈ సినిమా అద్భుతాలు చేస్తుందేమోనన్న నమ్మకం తనకైనా ఉందో లేదో. ఈ మూవీ ఎప్పుడూ వార్తల్లో లేదు. ఓ పాటేదో బాగానే ఎక్కింది కానీ ప్రమోషన్ వ్యవహారం సోసోగానే సాగుతోంది. వేయి శుభములు కలుగు నీకు, ఇది కథ కాదు, హాఫ్ స్టోరీస్ అనే మరో మూడు సినిమాలు ఆడియన్స్ ని పలకరించనున్నాయి. పైన చెప్పినవాటికి హైదరాబాద్ లాంటి నగరాల్లో సైతం ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాలేదు. అదన్నమాట పరిస్థితి.

కాస్త చెప్పుకోదగ్గ హైప్ ఉన్న సినిమాలన్నీ 12 తర్వాతే టార్గెట్ చేసుకోవడంతో ఒక మంచి ఫ్రైడే ఇలా వేస్ట్ అయిపోతోంది. ఒకవేళ దేనికైనా మంచి టాక్ వస్తే సంతోషమే. ఎందుకంటే శ్యామ్ సింగ రాయ్ తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. 31న రిలీజైన అర్జున ఫల్గుణ దారుణంగా దెబ్బ తినడంతో మాస్ ఆడియన్స్ కి పుష్ప, అఖండ, శ్యామ్ సింగ రాయ్ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇవి కూడా వీక్ డేస్ లో బాగా నెమ్మదించాయి. వీకెండ్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరైన కంటెంట్ తో ఏదైనా ఒక్క సినిమా బాగున్నా చాలు 2022కి మంచి బోణీ దక్కుతుంది. లేదంటే ఇంకో వారం రోజులు ఎదురు చూపులు తప్పవు

Also Read : Vijay Deverakonda & Rashmika Mandanna : మళ్ళీ విజయ్ -రష్మికల ప్రేమ ప్రచారం.. ఆ ఫోటోల ఎఫెక్ట్ తో!

Show comments