ఇప్పటి వరకూ పంచాయతీ ఎన్నికలు ప్రెసిడెంట్ ఎంపికలు వరికే మనం చూశాం. గ్రామానికి మొదటి పౌరుడిగా ఉండే సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన అనేక రాజకీయ కోణాలను మాట్లాడుకున్నాం. అసలు ఆ గ్రామం ఎలా నడుస్తుంది. గ్రామ నిర్వహణకు అభివృద్ధికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని ఖర్చు పెట్టేది ఎవరు..? ఇచ్చేది ఎవరు? అన్న విషయాలను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అంటు జాతిపిత మహాత్మా గాంధీ ఎందుకన్నారో? గ్రామాలు స్వయం అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుంటేనే ఈ ఎన్నికలకూ పరి పుష్టి లభిస్తుంది.
డబ్బులు వచ్చేది ఇలా!
గ్రామపంచాయతీ నిర్వహణ అంటే సాధారణ విషయం ఏమీ కాదు దానికి ఎంతో డబ్బు ఖర్చవుతుంది. సాధారణంగా గ్రామ పంచాయతీ కు ఇంటి పనులతో పాటు ప్రత్యేక రూపంలో మంచినీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ పంచాయితీ యంత్రాంగం నిర్దిష్ట స్థాయిలో పన్నులు వసూలు చేస్తోంది. వ్యాపార ప్రకటనల బోర్డులు హోర్డింగులు చదరపు మీటర్ల చొప్పున వసూలు చేస్తారు. అలాగే పన్నేతర ఆదాయం కింద వ్యాపారులకు ఇచ్చే లైసెన్స్ ఫీజు, ఆక్రమణలపై రుసుము, భవన నిర్మాణ అనుమతులు, జరిమానాలు, చేపల చెరువు పాటలు, గ్రామపంచాయతీ కొన్న ఆస్తుల తాలూకా అద్దెలు, ప్రజలు ఇచ్చే విరాళాల ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది. అలాగే భూముల క్రయ విక్రయాల ద్వారా ఆయా పంచాయతీల కు రిజిస్ట్రేషన్ మొత్తంలో 7.5 శాతం వాటా అందుతుంది. ఇవి కాకుండా పంచాయతీ కు ఆర్థిక సంఘం నిధులతో పాటుగా గ్రామాభివృద్ధి అవసరమైన కీలక శాఖలు నిధులు మంజూరు చేస్తాయి. తాగునీటి పథకాలు, పాఠశాలలు, వైద్యం రహదారులు తదితర పనులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిధులు వస్తుంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇది..
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తగిన నిధులు అందుతాయి. వృత్తి పన్ను రూపంలో రాష్ట్ర ఖజానా కు వచ్చే మొత్తంలో 95 శాతం తిరిగి ఆయా గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయిస్తుంది. అలాగే వినోదపు పన్ను రూపంలో వసూలైన మొత్తంలో 90 శాతం, గనుల తవ్వకాల సినరేజి రూపంలో వచ్చిన డబ్బులో 25 శాతం తిరిగి గ్రామానికి వస్తుంది. అలాగే గ్రామ పంచాయతీలో ఉన్న జనాభాకు తగ్గట్టుగా ప్రతి ఏడాది రూ 4 రూపాయలను సాధారణ అవసరాలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. అంటే ఆ పంచాయతీలో ఎంత జనాభా ఉంటే అలా ఒకరి మీద నాలుగు రూపాయలు వస్తాయి అనమాట. దీంతో పాటు ఏకగ్రీవాలు అయితే వచ్చే డబ్బులు, వసూళ్ళ ప్రోత్సాహక గ్రాంట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, అవార్డులు తాలూకా వచ్చే రివార్డుల సొమ్ము పంచాయతీల కే చెందుతుంది.
ఉపాధి నిధులు ఉంటాయి..
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామపంచాయతీలకు మరికొంత ఆదాయం కూడా వస్తుంది. ఒక గ్రామంలో లేదా పంచాయితీలో పనిచేసిన కూలీల పనులు, దినాలు ఆధారంగా ఇది ఇస్తారు. ఉపాధి హామీలో చేసిన ఖర్చులు 40 శాతం నిధులు మళ్లీ పంచాయతీకి వెనక్కి వస్తాయి. దీనికి పంచాయతీలో తమ వాటా ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. రోడ్లు డ్రైనేజీలు ఇతర పనులకు మేజర్ మైనర్ పంచాయతీలకు మొత్తం 70 శాతం 90 శాతం చొప్పున నిధుల విడుదల ఉంటుంది. అలాగే కేంద్రం సైతం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. ఇవి కూడా గ్రామ జనాభా నిష్పత్తిలో మనిషికి నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున అభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది.
ఖర్చులు ఇలా..
పంచాయతీకి వచ్చే సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీలు లేదు. అది నిర్దిష్టమైన స్థాయిలో ఓ లెక్క ప్రకారం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలు మిరితే కనుక అధికారుల ఆమోదం తీసుకోవాలి. సిబ్బంది వేతనాలకు 30% పారిశుద్ధ్యం ప్రజారోగ్యం 15శాతం, రక్షిత మంచినీటి సరఫరాకు 15 శాతం వీధి దీపాలకు 15 శాతం రహదారులు, డ్రైవర్ల కోసం 20 శాతం ఇతర పంచాయతీ ఖర్చులకు ఐదు శాతం నిధులను ఖర్చు చేయాలి. అలా కాకుండా దీనిని మించి ఇతర అవసరాలకు కనుక నిధులను ఖర్చు చేయాల్సి వస్తే జిల్లా ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి.
ఇలా గ్రామ పంచాయతీ కు కచ్చితమైన నిధులు వచ్చే మార్గాలు కట్ చేసే నిబంధనలు ఉన్నాయి. గ్రామపంచాయతీ విస్తీర్ణాన్ని బట్టి జనాభాను బట్టి మేజర్ మైనర్ పంచాయతీలుగా విభజించి దాని ప్రకారం మాత్రమే ముందుకు సాగాలని పంచాయతీరాజ్ చట్టాలు చెబుతున్నాయి. అయితే ఇంకా ఎన్ని చట్టాలు ఎన్ని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని సరిగా వినియోగించుకోవడంలో లోపం కారణంగానే ఇంకా స్థానిక స్వపరిపాలన మనకు అందని ద్రాక్షే అవుతోంది.