iDreamPost
iDreamPost
ఏలూరులో గుర్తు తెలియని అస్వస్థత గుట్టు మెల్లిమెల్లిగా బైటపడుతోంది. ప్రాథమికంగా రాష్ట్ర, కేంద్ర వైద్య బృందాలు ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ సంబంధిత ఇన్ఫెక్షన్ కాదని, ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అంటువ్యాధి కాదని ఇప్పటికే స్పష్టం చేసారు. దీంతో ఏలూరు పట్టణ వాసులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు, యంత్రాంగం కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఎయిమ్స్ బృందం సేకరించిన శాంపిల్స్‌లో లెడ్, నికెల్ వంటి భార లోహాల అవశేషాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా వెల్లడైన సమాచారం. భార లోహాలు శరీరంలోకి చేరిన ఫలితంగానే మూర్చ, నీరసరం, స్పృహతప్పడం, వాంతులు, విరేచనలు తదితర లక్షణాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఇవే కారణం అయితే ఈ లోహాలు ఏలూరు వాసుల శరీరాల్లోకి ఎలా చేరిందన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.
త్రాగునీరు, పాలు, ఆహార పదార్ధాల ద్వారానే ఇవి శరీరంలోకి చేరేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని సంబంధిత రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోకి చేరగానే ఒక విధంగాను, నేరుగా మెదడుకు చేరితే మరికొన్ని లక్షణాలు అదనంగాను బైటపడతాయని వివరిస్తున్నారు. ఇవే కాకుండా ఫాస్పేట్ వంటి పురుగుమందు అవశేషాలు, దోమల నియంత్రణకు వినియోగించే ఫైరిథ్రిమ్ వంటి మందు ప్రభావం కారణంగా కూడా మనుషుల్లో ఈ విధమైన లక్షణాలనే కలిగిస్తాయని చెబుతున్నారు. చూచాయగా కారణం ఏంటన్నది అంచనా వేసారు. అదెలా మనుష్యుల్లోకి చేరుతోందన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంటుందంటున్నారు.
సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో సాగులో పురుగుమందుల వినియోగం విపరీతంగా ఉంటుందన్నది ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కూరగాయలు, పళ్ళు వంటి వాటిని సాగు సమయంలోనే కాకుండా నిల్వ కోసం కూడా వివిధ రకాలైన మందులను వినియోగిస్తున్న పరిస్థితి ఉందంటున్నారు. కొన్ని రకాల కూరగాయలపై నిషేధిత సింథటిక్ ఫైరిత్రాయిడ్స్‌ను కూడా వినియోగిస్తున్నారన్న అనుమానాలు వెల్లడవుతున్నాయి. పురుగు మందుల షాపుల వారిచ్చే మందులపైనే ఆధారపడే రైతులు తమకు తెలియకుండానే కొన్ని ప్రమాదకర రసాయనాలను వినియోగించేస్తున్నారంటున్నారు.
ఇటువంటివి ఆయా వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే కాకుండా భూగర్భ జలాన్ని కూడా కలుషితం చేసే స్థాయిలో ఉంటున్నాయన్నది నిపుణులు చెబుతున్న మాట. ఇలా కలుషితమైన భూగర్భ జలం స్థాయి పైకి వచ్చిన నేపథ్యంలో నేరుగా మనుషుల మీద ప్రభావం చూపుతోందా అన్న అనుమానం కూడా లేకపోలేదు.
మరో వైపు జనావాసాల నుంచి వచ్చే మురుగు వ్యర్ధాలన్నీ పంట కాలువల్లోకే చేరుతున్నాయి. వాటిని డీ సిల్టేషన్ చేసి మాత్రమే కలపాలన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఇటీవల కురిసిన బారీ వర్షాలకు భూగర్భజలం గతం కంటే పైస్థాయికి వచ్చింది. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో నుంచి వచ్చిన ముంపునీరు త్రాగునీటి రిజర్వాయర్లలో కూడా కలిసిపోయిన పరిస్థితిలు ఉన్నాయి. అంతే కాకుండా చెత్త, ఇతర వ్యర్ధ పదార్ధాలను కూడా కాలువలు, చెరువుల సమీపంలోనే డంప్ చేస్తున్నారు. మరికొన్ని చోట్లయితే సాగు కాలువలను ఆనుకుని ఉన్న ఇరిగేషన్ స్థలాలను డంపింగ్ యార్డులగా కూడా ఉపయోగించుకుంటున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లోని మేజర్ పట్టణాలన్నింటికీ సాగు కాలువల ద్వారానే త్రాగునీరు కూడా అందుతోంది. అనంతరం ఆయా పట్టణాలకు సమీపంలో ఈ నీటిని ఫిల్టరేషన్‌చేసి ఇళ్ళకు సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చేస్తున్న సాధారణ ఫిల్టరేషన్ ద్వారా భార లోహాలైన సీసం, లెడ్, ఇతర పురుగు మందుల వ్యర్ధాలు ప్యూరిఫై అవుతాయా? లేదా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. వివిధ మార్గాల ద్వారా నీటిలోకి ఈ లోహాలు చేరి ఉండేందుకు అవకాశం ఉంది. అప్పటికే ఫిల్టర్ చేసిన నీటిని వినియోగించే వారికి కూడా అస్వస్థత కలిగిన నేపథ్యంలో ఆహారం, పాలుపై వైద్య బృందాలు దృష్టి సారించాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేసారు.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ బృందం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి, నేషనల్ సెంటర్‌ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందాలు స్థానిక వైద్య బృందాలతో పాటు ఈ అస్వస్థత గుట్టును తేల్చేందుకు నడుం కట్టాయి. త్వరలోనే దీని గుట్టు బైటపడుతుందని చెబుతున్నారు.