iDreamPost
iDreamPost
దేశమంతా ఇప్పుడు పౌరసత్వ మంటలు రాజుకున్నాయి. ఈశాన్యంలో మొదలయ్యి తూర్పు, ఉత్తరం మీదుగా దక్షిణాదికి కూడా పాకిన నిరసనోద్యమం చివరకు హస్తినను తాకింది. మొబైల్ సేవలు నిలిపివేసి, మెట్రో రైళ్లు ఆపేసి ఆందోళనలను అడ్డుకోవాలని కేంద్రం చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు వైఎస్సార్సీపీని ఇరకాటంలో పెట్టే ప్రమాదం కనిపిస్తోంది. దానిని అధిగమించడం ఆపార్టీకి ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది.
సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మైనార్టీ వర్గాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఏపీలో అధికార పార్టీకి ఆ వర్గాల్లో బలమైన పునాదులున్నాయి. అయినప్పటికీ మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ మద్ధతుగా నిలిచింది. ఇది పలువురు మైనార్టీలలో జగన్ తీరు పట్ల అనుమానాలకు కారణం అయ్యింది. పాలకపక్ష ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడికి మూలం అయ్యింది. మంత్రి అంజాద్ బాషాతో పాటు ఎమ్మెల్యేలందరినీ ఆ వర్గానికి చెందిన వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
దేశంలోని వివిధ ముఖ్యమంత్రుల వ్యవహారశైలి కూడా దానికి కారణం. ఎన్నార్సీని అమలు చేసేది లేదని తొలుత కేరళలో వామపక్ష ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన్ని అనుసరించి పంజాబ్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటుగా బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కూడా ఎన్నార్సీని అమలు చేయడం లేదని తేల్చేశారు. అదే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బిల్లు ప్రతిపాదిత దశలోనే వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ తన వైఖరి వెల్లడించడం, అదే సమయంలో వైఎస్సార్సీపీ మాత్రం బీజేపీ కి మద్ధతుగా నిలవడంతో ఇప్పుడు అందరూ జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నార్సీ విషయంలో జగన్ వైఖరి స్పష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంట్ లో ఎన్నార్సీ బిల్లుకు అనుకూలంగా ఓటేసింది. కానీ ఓటింగ్ సమయంలో కేశినేని నాని దూరంగా ఉన్నారు. ఆయన తాజాగా ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలో భాగస్వాములవుతున్నారు. దాంతో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అది కూడా మైనార్టీల్లో సందేహాలను పెంచుతోంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ మాత్రం కొంత సతమతం అవుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా తాము కూడా ఎన్నార్సీకి వ్యతిరేకంగా అంటూ మైనార్టీ సంక్షేమ మంత్రి ప్రకటించారు. కానీ అది మైనార్టీలో సంతృప్తిని కలిగిస్తుందా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. నేరుగా సీఎం తన వైఖరి వెల్లడించాలని పలువురు కోరుతున్న తరుణంలో మైనార్టీలను దూరం చేసుకోకుండా ఉండేందుకు కీలకమైన అంశంలో ఆచితూచి వ్యవహరించాలని ఏపీలో అధికార పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా కనిపిస్తోంది. అటు మోడీ , ఇటు మైనార్టీగా మారిన పరిస్థితుల్లో జగన్ పై ఒత్తిడి పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.