iDreamPost
android-app
ios-app

శ‌భాష్…అమలాపురం పోలీస్

  • Published May 25, 2022 | 12:48 PM Updated Updated May 25, 2022 | 12:48 PM
శ‌భాష్…అమలాపురం పోలీస్

అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. రాళ్లు రువ్వారు. త‌గ‌ల‌బెట్టారు. అయినా ఎక్కడా, ఎవరిపైనా, లాఠీ విరిగ‌లేదు. 20మంది పోలీసులకు రాళ్ల దెబ్బలు తగిలినా, సంయ‌మ‌నం పాటించారు.

మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని చుట్టుముట్టి విధ్వంసం సృష్టించిన స‌మ‌యంలో, ప్రజా ప్రతినిధులను అమలాపురం నుంచి వేరే సుర‌క్షిత‌ ప్రాంతాలకు తరలించడంలో పోలీసులు విజ‌య‌వంత‌మైయ్యారు. అదేస‌మ‌యంలో ఆందోళ‌నకారుల‌ అదుపులో ఎక్కడా పట్టు తప్పలేదు. గొడ‌వ‌లు వ‌ద్ద‌ని ఇరు వ‌ర్గాల‌కూ చెబుతూ వచ్చారు.

కొన్ని అసాంఘిక శక్తులు అమలాపురంలో మంగళవారం మధ్యాహ్నం అల్లర్లు, విధ్వంసానికి పాల్పడ‌గానే, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసు బలగాలు మొత్తం రంగంలోకిదిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించాయి.

ఎస్పీ సుబ్బారెడ్డితోపాటు 20 మందిపై, రాళ్లతో అల్ల‌రి మూక‌లుదాడిచేసినా, రాళ్ల దెబ్బ‌లు త‌గిలినా పోలీసులు సంయమనం కోల్పోలేదు. హెచ్చరిక‌గా గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా, ప్లాన్ ప్ర‌కారం విధ్వంసాన్ని సృష్టిస్తున్న అల్లరిమూకలు వెనక్కి తగ్గలేదు. అల‌లు అల‌లుగా వ‌చ్చిప‌డుతూనే ఉన్నారు. తుని ఘ‌ట‌న గుర్తుకొచ్చేలా కొంద‌రు ప్ర‌వ‌ర్తించినా, పోలీసు కాల్పుల వరకు పరిస్థితి దిగజారకుండా, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.

పరిస్థితి అదుపుత‌ప్పుతోంద‌న‌గానే అదనపు పోలీసు బలగాలను అమలాపురానికి పంపించారు. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రాజమహేంద్రవరం ఎస్పీ ఐశ్వర్యరస్తోగీ, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్, ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌లను వెంటనే అమలాపురం వెళ్లాలని ఆదేశించారు డీజీపీ.

అమలాపురంలో ర‌గిలిన చిచ్చు కోనసీమకు అంటేలోగా. పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకల్లా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ముందు ఆందోళ‌న కారుల అస‌లు ప్లాన్ అర్ధం చేసుకున్నారు. దాదాపు నాలుగైదువేల మందిని వేర్వేరు చోట్ల ఉంచి అల్లర్ల‌కు పాల్పడేలా కొన్ని శక్తులు కుట్రపన్నాయని పోలీసుల‌కు స‌మాచారం అందింది. అందుకే సోషల్‌ మీడియాలో పోస్టులను స్ట‌డీచేస్తున్నారు. అమలాపురంలో అల్లర్ల సమయంలో తీసిన వీడియో ఫుటేజీ, ఫొటోలను బ‌ట్టి ఎవ‌రురెచ్చ‌గొట్టారు? ఎవ‌రు విధ్వంసానికి కార‌కులైయ్యారో గుర్తించనున్నారు.

అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నా పోలీసులు సర్దిచెప్పి వెన‌క్కి పంపిస్తున్నారు. అమలాపురం మొత్తం అల్ల‌ల్లాడినా, ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగలేదంటే పోలీసులను మెచ్చుకోవాల్సిందే