iDreamPost
android-app
ios-app

లేటు వయసు హీరోగా భలే ఆఫర్లు

  • Published Oct 06, 2021 | 9:37 AM Updated Updated Oct 06, 2021 | 9:37 AM
లేటు వయసు హీరోగా భలే ఆఫర్లు

తెలుగు సినిమా గమనాన్ని మార్చిన అతికొద్ది దర్శకుల్లో ఖచ్చితంగా చేర్చాల్సిన పేరు కె రాఘవేంద్రరావు. ఎన్టీఆర్ తో అడవి రాముడు తీసినా, చిరంజీవికి ఘరానా మొగుడు ఇచ్చినా, నాగార్జునను ఊహించని రీతిలో అన్నమ్మయ్యగా చూపించినా వాటితో చరిత్రలు సృష్టించడం ఆయనకే చెల్లింది. ఇమేజే లేని శ్రీకాంత్ ని పెళ్లి సందడితో ఓవర్ నైట్ స్టార్ చేసి ఆఫర్ల వర్షం కురిసేలా చేసిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. గంగోత్రి సక్సెస్ తర్వాత దర్శకేంద్రుడి మేజిక్ తగ్గిపోయింది. ఓం నమో వెంకటేశాయ డిజాస్టర్ దెబ్బకు మళ్ళీ డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు పెళ్లిసందDతో కేవలం పర్యవేక్షణకే పరిమితమవుతున్నారు.

ఇందులో ఓ కీలక పాత్ర చేయడంతో ఇప్పటికే జనాల దృష్టిని ఆకర్షించిన రాఘవేంద్రరావు హీరోగా త్వరలో రెండు సినిమాలు రూపొందబోతున్నాయనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు, మనసంతా నువ్వే ఫేమ్ విఎన్ ఆదిత్య డైరెక్టర్ గా మరో సినిమా లాక్ అయ్యాయట. మొదటి దాంట్లో నలుగురు హీరోయిన్లు కూడా ఉంటారని గతంలోనే ప్రచారం జరిగింది. అయితే వీటి సబ్జెక్టులు కమర్షియల్ ఫార్మాట్ లో ఉండవు కానీ చాలా డిఫరెంట్ గా అరవై ఏళ్ళ వ్యక్తిని హీరోగా చూపిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో సాగుతాయట. అధికారిక ప్రకటనలు వచ్చాక క్లారిటీ వస్తుంది.

అయినా ఎన్నడూ లేనిది రాఘవేంద్రరావు ఇలా మేకప్ వేషాల మీద మనసు పారేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆరు పదుల వయసుతో హీరో పాత్రలు సక్సెస్ కాలేవా అంటే అవుతాయి. నాగేశ్వర్ రావు కాలేజీ బుల్లోడు-సీతారామయ్య గారి మనవరాలు, జెవి సోమయాజులు శంకరాభరణం లాంటి సినిమాలు దానికి మంచి ఉదాహరణ. ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ వీటికి మించిన బెస్ట్ ఎగ్జాంఫుల్. కానీ ఇవన్నీ చేసినది అనుభవం ఉన్న ఆర్టిస్టులు. కానీ దర్శకేంద్రులకు అంత ఎక్స్ పీరియన్స్ ఎక్కడిది. మరి ఇంత ధైర్యంగా దర్శకులు ముందుకు వస్తున్నారంటే నిజంగానే పెళ్లిసందడిలో అంత బాగా యాక్ట్ చేశారా. ఏమో 15న థియేటర్లో తెలిసిపోతుంది

Also Read : థియేటర్ గ్యాప్ ని తగ్గించుకుంటున్న డిజిటల్