iDreamPost
iDreamPost
సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర సృష్టించి తొలిసారి అధికారం చేపట్టిన జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగ్విజయంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటే.. ప్రభుత్వం ఎన్నికల్లో.. ఆ తర్వాత ఇచ్చిన హామీల అమలు, ప్రజల కోసం చేపట్టిన ఇతర కార్యక్రమాలు వివరిస్తూ బహిరంగ లేఖ రూపంలో ప్రజల వద్దకు వెళ్లింది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంపై చార్జిషీట్ అంటూ.. పాత ఆరోపణల పచ్చడిని రిలీజ్ చేసింది.
వాస్తవానికి అధికారంలోకి వచ్చి వైఎస్సార్సీపీకి రెండేళ్లు అయినట్లే.. ప్రతిపక్ష పాత్రలో టీడీపీ కూడా రెండేళ్లు పూర్తి చేసుకుంది. అధికార పార్టీ చెప్పుకున్నట్లే.. ఈ రెండేళ్లలో ప్రజల కోసం.. ప్రజల తరపున తానేం చేసిందో టీడీపీ చెప్పుకోగలిగితే బాగుండేది. కానీ ఆ ఊసు ఎత్తకుండా.. షరా మామూలుగా ప్రభుత్వంపై ఊక దంపుడు ఆరోపణలు, టీడీపీ నేతల ఆరెస్టులంటూ గగ్గోలు పెట్టింది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం తానేం చేయలేదని, ఆ పాత్రలో పూర్తిగా ఫెయిల్ అయ్యానని చెప్పుకోలేకే చార్జిషీట్ హడావుడి అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రోజుల క్రితమే జరిగిన మహానాడులోనూ ఇవే ఆరోపణలు తప్ప ప్రజలకు సంబంధించిన ప్రస్తావనలు లేకపోవడం గమనార్హం.
కష్ట కాలంలో రాష్ట్రంలో లేకుండా..
విభజన గాయాలతో, ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు మరిన్ని కష్టాల్లోకి నెట్టి వెళ్లిపోయారు. జగన్ పాలన చేపట్టేనాటికి రూ.100 కోట్లు మాత్రమే ఖాజానాలో ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబుకు లోటుపాట్లన్నీ తెలుసు. దానికితోడు ఏడాదికి పైగా కరోనా సంక్షోభంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అదే సమయంలో కోవిడ్ నియంత్రణ ఖర్చులు అదనపు భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో అనుభవజ్ఞునిగా నిర్మాణాత్మక సూచనలతో ప్రభుత్వానికి, మనోధైర్యం కల్పిస్తూ ప్రజలకు అండగా అందుబాటులో ఉండాల్సిన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్.. ఇద్దరూ రాష్ట్రాన్ని వదిలి హైదరాబాద్లో కాలక్షేపం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో మకాం పెట్టిన చంద్రబాబు.. పదవి పోయాక హైదరాబాదుకు మారిపోయారు. అక్కడనుంచే తరచూ జూమ్ సమావేశాలు, ట్విట్టర్ ప్రకటనలతో పత్రికలు, టీవీల్లోనే కనిపిస్తున్నారు.
రాజకీయ ఆరోపణలు
ప్రజల బాగోగులను ఈ రెండేళ్లలో అసలు పట్టించుకోని బాబు బృందం.. నిరంతరం తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మాత్రమే ఆరోపణలు గుప్పిస్తుంటారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ రంధ్రాన్వేషణ చేసి లేనిపోని ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారు. వీరి తీరును గమనించినందునే స్థానిక సంస్థల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రజలు మరోసారి చిత్తుగా ఓడించారు.
ప్రజలను వదిలి హైదరాబాదుకు పలాయనం చిత్తగించిన చంద్రబాబు.. ప్రజాసమస్యలపై చర్చకు చక్కటి వేదిక అయిన అసెంబ్లీ సమావేశాలను సైతం కుంటి సాకులతో బహిష్కరించి.. మాక్ అసెంబ్లీ డ్రామా ప్రదర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కోవిడ్ టీకాలు, ఆక్సిజన్ సరఫరా, విభజన హామీల అమలు తదితర సమస్యలపై బాధ్యతాయుత ప్రతిపక్షంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వంతో కలిసి రాకపోగా.. కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా మద్దతు ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేయడం ఆక్షేపానీయం. ఇవన్నీ ప్రతిపక్షంగా టీడీపీ ఘోర వైఫల్యానికి తార్కాణాలు.