Idream media
Idream media
దుబ్బాక లో విజయమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు. దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యత సీఎం కేసీఆర్ హరీష్ రావు కు అప్పగించడంతో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఆ స్థానాన్ని వారి కుటుంబ సభ్యులకు కేటాయించి ఏకగ్రీవం చేసేవారు. సానుభూతి ఆనవాయితీకి టిఆర్ఎస్ మంగళం పాడింది. గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలైన పాలేరు, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి పెట్టింది. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవటం తో గతంలో టిఆర్ఎస్ అవలంబించిన విధానాన్ని ఇతర పార్టీలు ఫాలో అవుతున్నాయి. కాంగ్రెస్ బిజెపి జన సమితి పార్టీలు పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో దుబ్బాకలో త్రిముఖ పోటీ అనివార్యం.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దే. గత ఎన్నికల రికార్డులను పరిశీలిస్తే అది నిజమే అని అర్థమవుతోంది. మరి దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు మంత్రం పారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దుబ్బాక సీటును దక్కించుకునేందుకు అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నాయి. అక్టోబరు నవంబర్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. బిజెపి నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు అందరికంటే ముందే ప్రచారం మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కాస్త ఈ విషయంలో వెనకబడిందని చెప్పవచ్చు. ఇక టిఆర్ఎస్ మాత్రం అభ్యర్థి ఎవరైనా గెలుపు నల్లేరు మీద నడకే అనే భావనలో ఉంది. నియోజకవర్గంలో రామలింగ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సానుభూతి తమ విజయానికి దోహదం చేస్తాయని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. పార్టీ టికెట్ కూడా రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇచ్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సిద్ధమయ్యారు. దీనికి తోడు ఇన్చార్జిగా మంత్రి హరీష్ రావు ను రంగం లోకి దించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు లో హరీష్ రావు ముద్ర వుండటంతో క్యాడర్ లో జోష్ పెరిగింది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడంలో హరీష్ రావు తన వంతు పాత్ర నిర్వహించారు. దుబ్బాక లోనూ టిఆర్ఎస్ విజయానికి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టారు.