iDreamPost
android-app
ios-app

శేఖర్ కమ్ముల గీసిన కాలేజీ పెయింటింగ్ – Nostalgia

  • Published Sep 26, 2021 | 11:29 AM Updated Updated Sep 26, 2021 | 11:29 AM
శేఖర్ కమ్ముల గీసిన కాలేజీ పెయింటింగ్ – Nostalgia

సరిగ్గా వాడుకోవాలే కానీ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు ఒక్క యూత్ వల్లే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తాయి. భారీ బడ్జెట్ అవసరం లేదు. కోట్ల ఖర్చు ఉండదు. ఏదైనా పెద్ద కళాశాలను షూటింగ్ కి అనుగుణంగా ఎంచుకుని స్క్రిప్ట్ విషయంలో కుర్రకారుని మెప్పించే కంటెంట్ ఉండేలా చూసుకుంటే చాలు బ్లాక్ బస్టర్ ఖాయం. ఇలాంటి బ్యాక్ డ్రాప్ వాడుకుని అద్భుత విజయాలను సాధించిన ప్రేమ దేశం, ప్రేమ సాగరం, నువ్వు నేను, 3 ఇడియట్స్ లాంటివి కొన్ని ఉదాహరణలు. కొన్నింటిలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ దాకా కాలేజీ వాతావరణం ఉండదు. కథ ప్రకారం వేరే లొకేషన్లకు వెళ్లిపోతాయి. హ్యాపీ డేస్ ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.

1999లో ‘డాలర్ డ్రీమ్స్’ అనే లో బడ్జెట్ మూవీ తీశాక శేఖర్ కమ్ములకు ఒక ప్రేక్షక వర్గంలోనే గుర్తింపు వచ్చింది. దానికి కమర్షియల్ స్కేల్ లేకపోవడంతో కామన్ ఆడియెన్స్ కి ఎక్కువ చేరలేదు. అయిదేళ్ళు వేచి చూశాక 2004లో ‘ఆనంద్’తో ఇతని సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ తో పోటీ పడి మరీ వంద రోజులు ఆడటం అప్పట్లో రికార్డు. 2006లో ‘గోదావరి’తో మరో ఫీల్ గుడ్ మూవీతో ఆకట్టుకున్న ఈ విలక్షణ దర్శకుడు 2007లో పూర్తి కాలేజీ నేపధ్యాన్ని తీసుకుని రూపొందించిన సినిమా హ్యాపీ డేస్. రొటీన్ ఫార్ములాకు దూరంగా కేవలం యూత్ ఫీలింగ్స్ ని తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం గొప్పగా చేశారు. అందరూ కొత్త నటీనటులనే తీసుకోవాలనే ఆలోచనతో శేఖర్ కమ్ముల రెడ్ ఎఫ్ఎం, ఐడిల్ బ్రెయిన్ సహాయంతో ఆడిషన్లకు శ్రీకారం చుట్టారు.

అందరూ కొత్తవాళ్లే. ఒక్క తమన్నాకు మాత్రమే అప్పటికి మంచు మనోజ్ తో నటించిన శ్రీతో అనుభవం ఉంది. వరుణ్ సందేశ్ సెలక్షన్ ఈమెయిల్ ద్వారా జరిగిపోయింది. నిఖిల్, వంశీ చాగంటి, గాయత్రీ రావు, రాహుల్, సోనియా దీప్తి, మొనాలిలను మెయిన్ లీడ్స్ గా తీసుకున్నారు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాలో ఎలాంటి హడావిడి ఉండదు. కూల్ గా ఫ్రెష్ గా చూస్తున్నంత సేపు మన ప్రతిఒక్కరికి కాలేజీ రోజులు గుర్తొచ్చేంత అందంగా శేఖర్ కమ్ముల ప్రెజెంట్ చేసిన తీరు బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. ఇరవై కోట్లకు పైగా వసూలు చేయడం ఒక రికార్డు. 2007 అక్టోబర్ 2 విడుదలైన హ్యాపీ డేస్ సూపర్ సక్సెస్ అయ్యింది. కేవలం అయిదు రోజుల ముందు వచ్చిన రామ్ చరణ్ డెబ్యూ చిరుత తాకిడిని తట్టుకుని విజయం సాధించడం అసలు ట్విస్టు

Also Read : మరువలేని మధుర గాత్రం – Nostalgia