Idream media
Idream media
ఈ రోజు సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఆయనంటే ఇష్టం. ఆయన నటనంటే అఇష్టం. అన్ని సమయాల్లో ఒకేలా నటించగలడు. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరిసీతారామరాజు ఇలా ఒకట్రెండు మినహాయిస్తే మిగతావన్నీ గుర్తు లేని సినిమాలే. నిజానికి కృష్ణ హాస్యపాత్రలు ఎప్పుడూ వేయలేదు కానీ, యూట్యూబ్‌లో ఆయన సినిమాలు చూసినప్పుడు భలే నవ్వొస్తుంది. ఇవన్నీ ఒకప్పుడు ఎలా చూశామా అనే అనుమానం కూడా వస్తుంది.
జానపదాలు, పౌరాణికాల్లో ఎన్టీఆర్ , ప్రేమకథల్లో నాగేశ్వరరావు దున్నేస్తున్న రోజుల్లో వాళ్ల సందులో కృష్ణ ఎలాగో చొరబడ్డాడు. నాకు గుర్తుండి నేను చూసిన ఫస్ట్ సినిమా అల్లుడే మేనల్లుడు. జాబిల్లి వస్తాడే పిల్ల అనే మంచి పాట ఉంది దీంట్లో.
మా పనమ్మాయి వెంట వెళ్లి సినిమా చూస్తూ చూస్తూ నిద్రపోయినట్టు గుర్తు. తర్వాత పెద్దయ్యాకా కూడా కృష్ణ సినిమాల్లో చాలాసార్లు నిద్రపోయాను.
మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాని 40 పైసల నేల టికెట్ 45 పైసలు బ్లాక్‌లో కొని చూశాను. ఐదు పైసలకి టికెట్ బ్లాక్‌లో అమ్మారంటే ఎంత అమాయక బ్లాక్‌మార్కెటర్లో ఒకసారి ఊహించుకోండి. ఆయన గుర్రం మీద వెళుతూ రివాల్వర్‌తో కాలుస్తుంటే నాకు పూనకం వచ్చింది.
జానపద సినిమాల్లో ఎన్టీఆర్ గుర్రం ఎక్కేవాడు కానీ, అది కదిలేది కాదు. వేగంగా వెళ్లాలంటే చెక్క గుర్రం ఎక్కి చెమట తుడుచుకునే వాడు. వెనుక స్క్రీన్స్ కదులుతూ ఉండేవి. ANR వేరే గుర్రం ఎక్కేవాడు. ఆయన ఒరిజనల్ గుర్రం అలవాటు లేదు. రహస్యం అనే సినిమాలో ఆయన గుర్రం ఎక్కి కత్తి తీసుకుంటే జనం కకావికలై పారిపోయారు.
నిజంగా గుర్రం ఎక్కి అడవుల్లో పరిగెత్తించిన తొలి హీరో కృష్ణనే. లోడ్ చేయకుండా ఎంత మందినైనా కాల్చేసేవాడు. అన్నీ ఆటోమెటిక్ రివాల్వర్లు. కాల్చిన తర్వాత రివాల్వర్ పొగని కూడా ఊదేవాడు.
హాలీవుడ్ ప్రేరణతో 69-74 వరకు ఐదేళ్లు కౌబాయ్ సినిమాలు రాజ్యమేలాయి. వాటి పేర్లు కూడా తమాషాగా ఉండేవి. హంతకులు వస్తున్నారు జాగ్రత్త…మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త..పగసాధిస్తా… మొత్తం ఫైటింగ్ సినిమాలు. ఫైట్‌కి ఫైట్‌కి మధ్య కొంచెం కథ ఉండేది. ఈ రకం సినిమాలు పది వస్తే ఎనిమిదిలో కృష్ణ హీరో.
తర్వాత వచ్చిన జేమ్స్‌బాండ్ సినిమాల్లో కూడా ఆయనే హీరో. ఈ జానర్లో శోభన్‌బాబు కూడా ఒకట్రెండు ప్రయత్నించాడు (కిలాడీ బుల్లోడు). అవి ఆడలేదు. దాంతో ఫ్యామిలీ హీరోగా సెటిలై పోయాడు.
కృష్ణ కూడా అన్ని రకాల సినిమాలు చేశాడు. ఆయన రైతు వేషం వేసినా, మారు వేషంలో ఉన్న జేమ్స్‌బాండ్‌లా ఉండేవాడు. ఆయన చాలా ధైర్యవంతుడు. దీనికి ఉదాహరణ దేవదాసు సినిమా తీయడమే.
కృష్ణ దేవదాసు చూసి మూడు రోజులు జ్వరం వచ్చింది నాకు. పాత దేవదాసుకి దిష్టి తగలకుండా ఉండడానికి తీసినట్టున్నారు. ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒక సినిమా తీయడానికి ఆయాస పడతారు. ఆయన ఏడాదికి పది సినిమాలు లాగేసేవాడు. పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి కల్పించేవాడు. ఆయన ఎంత మంచోడంటే డబ్బు ఎగ్గొట్టిన నిర్మాతలకి కూడా మళ్లీ సినిమాలు చేసేవాడు.
శ్రావణ్ అనే మిత్రుడు చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి మద్రాస్ చేరాడు. రోడ్డు మీద తిరుగుతున్న కుర్రాన్ని కృష్ణ విజయనిర్మల దంపతులు ఆదరించి ఇంట్లో పెట్టుకున్నారు. దయ ఆయన ఇంటిపేరు.
కృష్ణ నటన మీద అనేక అభిప్రాయాలు ఉండొచ్చు కానీ, ఆయన మంచితనం మీద అందరిదీ ఒకే అభిప్రాయం. అందుకే ఆయన రాజకీయాల్లో రాణించలేకపోయాడు.
విజయనిర్మల మృతి ఆయనకు చాలా బాధ కలిగించినా , ధైర్యంగా తట్టుకున్నారు. జీవించి ఉన్న పాతతరం హీరోల్లో ఆయన ఆఖరి వారు. నిండు నూరేళ్లు జీవించాలని, ఇప్పుడు కూడా సినిమాల్లో నటించాలని అందరి కోరిక.