iDreamPost
iDreamPost
వాహ్ ఎం తేజస్సు బిడ్డా , కోహినూర్ వజ్రం గురించి వినడమే తప్ప చూడలేదు , బహుశా అది నీ లాగే ఉంటుందేమో .
“ఆది” సినిమాలో హీరో నుద్దేశించిన డైలాగ్ …
అంతకన్నా పై స్థాయిలో నిలిచారు జగన్ తన అభిమానుల దృష్టిలో అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
వజ్రానికుండే దృఢత్వాన్ని జగన్ లో చూడొచ్చు . రాజకీయ రంగ ప్రవేశం చేసిన వెంటనే తన తండ్రి వైఎస్ గారి హఠాన్మరణంతో ఏర్పడిన సూన్యతను భర్తీ చేస్తూ ఆయన మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన అభిమానుల్ని పరామర్శిస్తూ సాగిన పయనంలో ఎన్ని ఆటంకాల్ని అధిగమించాడో తలుచుకొంటేనే వళ్ళు జలదరిస్తుంది.
అంతర్గత కారణాలేమైనా జగన్ని వారసుడిగా ఎదగనివ్వటానికి ఇష్టపడని సోనియా ఓదార్పు యాత్ర వద్దన్నప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా పేరు పడ్డ అధికార కేంద్రాన్ని ఎదిరించటానికి వెనుకాడని నైజంతో అతని అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా నిలిచిపోయాడు.
కాంగ్రెస్ ని వదిలి బయటికి పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని సన్నిహితుల ద్వారా హెచ్చరించినా ఈషన్మాత్రంగా లెక్క చేయకుండా కాంగ్రెస్ అధినేత్రిని ధిక్కరించిన ఫలితం కానీ మరో కారణం కానీ వరసగా వివిధ పక్షాలు పెట్టిన ఇబ్బందులు , ఇన్నాళ్లు దగ్గర ఉన్నవాళ్లే మరుసటి రోజు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం , ఓ వైపు కాంగ్రెస్ , ఓ వైపు టీడీపీ , మరో వైపు ఆరోపణలు , వరుస కేసులు , వేధింపులు ఒక్కుమ్మడిగా దాడి చేసినా చెక్కుచెదరక ఒంటరిగా ఎదుర్కొన్న అతని మానసిక స్థైర్యం అంచనాలకు అందనిది.
కాంగ్రెస్ ని ఆ పార్టీ పదవులకి రాజీనామా చేసి సొంతంగా పోటీ చేసి అతను తెచ్చుకున్న ఐదు లక్షల పై చిలుకు రికార్డు మెజారిటీతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించాడంటే అతిశయోక్తి కాదు.
ఓ పక్క బాబు లాంటి చాణిక్యుడు , ఏకపక్షంగా దాడి చేసే మీడియా ఓ పక్క , వరుస కేసులతో ఎగబడిన సీబీఐ , ఈడీ వాటిని వెనకుండి నడిపించిన ఢిల్లీ పెద్దలు కలిసి కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని 16 నెలల పాటు జైలుపాలు చేస్తే మరొకరు అయితే నీరుగారిపోయి దాసోహం అనటమో , అన్నీ వదిలేసి దూరంగా పోయి బతకటమో చేసేవారు.
మరి 36 ఏళ్లకే ఇతనికి ఇంత ధైర్యం , పట్టుదల , తెగింపు ఎలా వచ్చాయో కానీ అవే అతని ఆయుధాలు అయ్యాయి.
జైలు జీవితం ఎంతటి వారికైనా నిజ జీవితంలో రాజీ ధోరణిని నేర్పుతుంది . కానీ ఇతనిని మరింత దృఢంగా చేసిందే తప్ప లొంగదీయలేకపోయింది. తన గమ్యం ముఖ్యమంత్రి పీఠం అని స్పష్టత ఎలా ఇచ్చాడో , తన పంధాని కూడా దాచుకునే ప్రయత్నం ఏ రోజూ చేయలేదు. నచ్చని వాళ్ళతో కలిసింది లేదు . వెంట ఉన్నవాళ్ళని వదిలిందీ లేదు . కష్టమో నష్టమో ముందుకే సాగాడు కానీ వెనకడుగు వేసిందీ లేదు.
2014 ఎన్నికలలో అనుభవలేమితో కానీ , వ్యూహాల లోపాలు కానీ , రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ , సామాజిక నాయకత్వాలు ఏకమై పోరాడినా ఒంటరిగా ఎదుర్కొని ఓటమి పాలైనా అభిమానుల మనస్సులని మాత్రం గెలుచుకొన్నాడు తన పోరాట విధానంతో.
ఓటమిని ఏ మాత్రం లెక్క చేయకుండా మరింతగా ప్రజల్లో మమేకమైన తీరు ఇప్పటి యువనాయకులు జగన్ ని చూసి నేర్చుకోవచ్చు . ఎండనకా వాననకా ప్రజా సమస్యలపై ప్రతి రోజూ అతను పోరాడినట్లు వాళ్ళ నాయన కూడా పోరాడలేదు అని తండ్రి అభిమానుల నుండి పొందిన మెచ్చుకోళ్లు వెయ్యేనుగుల బలం ఇచ్చి ఉండొచ్చు జగన్ కి.
అధికార పక్షం తన ఎమ్మెల్యేలను , ఎంపీలను లాక్కుని అసెంబ్లీలో వాళ్ళ చేతే అవమానిస్తున్నా తృణప్రాయంగా ఎంచి సమస్యల పట్ల పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం . చివరికి తన వాణి వినిపించే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సాగిస్తున్న అసెంబ్లీని బహిష్కరించి తండ్రి బాటలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి మెప్పించిన ఓర్పు , సహనం బహుశా రాజశేఖర్ రెడ్డి గారిచ్చిన తరగని ఆస్తులేమో.
341 రోజులు 2500 పై చిలుకు గ్రామాల్ని తాకుతూ 3650 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర కేవలం యాత్ర కాదు ఒక వ్యక్తి జీవితంలో నుండి అమూల్యమైన యాడాది కాలాన్ని హరించిన యాత్ర . కుటుంబాన్ని , ఆత్మీయులని , తన వ్యక్తిగత సరదా సంతోషాల్ని వదులుకొని అంత కాలం ప్రజల సమస్యలు , అవసరాలు తెలుసుకొంటూ జనంలో మెసలిన వ్యక్తి ప్రస్తుత కాలంలో మరొకరు లేరనుకొంటా.
లక్ష్యఛేదనకి ముహూర్తం పాదయాత్రలోనే ఖరారైంది అనిచెప్పొచ్చు ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు . అదీ సాదాసీదాగా కాదు . తన కష్టానికి తగ్గట్టుగా దేశం తన వైపు చూసేట్టుగ్గా దిగ్విజయాన్ని సాధించాడు . మే 23 ప్రజల పక్షాన పోరాడే స్థానం నుండి ప్రజల కోసం శాసనాలు చేసే స్థానంలోకి వచ్చిన తీరు అతని అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ప్రభుత్వ పాలనలో సైతం తన మేనిఫెస్టో హామీలకు ప్రధమ ప్రాధాన్యతనిస్తూ కొన్ని ఆసక్తికర ఘట్టాలతో ముందుకు సాగుతున్న జగన్ గారి పాలన ప్రజారంజకంగా సాగాలని అభిమానులందరి మదిలోనే కాకుండా రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో సుపరిపాలనతో స్థానం సంపాదించుకోవాలని కోరుకొంటూ. దివంగత ముఖ్యమంత్రి గారి తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.