ప్రజా సంక్షేమ పాలనతో దూసుకుపోతున్న జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో హమాలీలకు చెల్లించే చార్జీలను పెంచాలని ఆదేశాలను జారీ చేసింది. దీంతో హమాలీలకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రేషన్ పంపిణీలో భాగంగా స్టాకు పాయింట్ల వద్ద నుండి రేషన్ దుకాణాలకు సరకులను తరలించే హమాలీలకు లాభం చేకూరేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో హమాలీలకు క్వింటాల్ లోడింగ్ మరియు అన్‌లోడింగ్ చేసినందుకు 19 రూపాయలు చెల్లించేవారు. ఇకపై వారికి 22 రూపాయలు చెల్లించనున్నారు. అంతేగాక పెంచిన ధరలను ఈ ఏడాది జనవరి నుండి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై 9.09 కోట్ల అదనపు భారం పడనుంది.