iDreamPost
android-app
ios-app

బిడ్డను ఇంట్లో వదిలి.. కరోనాపై పోరుకు సిద్ధం హ్యాట్సాస్‌ IAS సృజన

బిడ్డను ఇంట్లో వదిలి.. కరోనాపై పోరుకు సిద్ధం హ్యాట్సాస్‌ IAS సృజన

సివిల్‌ సర్వీసెస్‌ అంటే ఒక హుందాతనం, ఒక గురుతర బాధ్యత. దేశంలో అత్యున్నతమైన ఉద్యోగం. తమకు వచ్చిన హోదాను కొందరు అధికారంగా భావిస్తే.. మరికొందరు దాన్ని బాధ్యతగా భావిస్తారు. తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. అత్యవసరం అనుకున్నప్పుడు కుటుంబాన్ని, పిల్లల్ని కూడా వదిలి కార్యోణ్ముఖులవుతారు. ప్రజలకు సేవ చేయడానికి ప్రతి క్షణం ఉత్సాహం చూపుతూ ఉంటారు.

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది రేయనక పగలనక పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ నేపథ్యంలో విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్‌ ఐఏఎస్‌ సృజన విధుల్లో పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా? అవును గొప్పే.. ఎందుకంటే ఆమె ఇటీవలే 20 రోజుల కిందట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారి ఆలనా పాలనలో మునిగి ఉండాల్సిన ఆమె.. కరోనాపై పోరుకు సిద్ధమయ్యారు. తన సెలవులను రద్దు చేసుకుని తనంతట తానుగా విధులకు హాజరవుతున్నారు. తన బిడ్డ బాగోగులను భర్త, తన తల్లికి అప్పగించి నగర భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రంగంలోకి దిగారు. విశాఖపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న తాను విధుల్లో ఉండడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందనే భావనతోనే బాధ్యతలు తీసుకున్నానని ఆమె చెబుతున్నారు. నగరంలో కరోనా ఎఫెక్ట్‌ అయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సిబ్బందికి సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఐఏఎస్‌ సృజన త్యాగానికి విశాఖ నగర ప్రజలు హాట్సాప్‌ చెబుతున్నారు.

ఈమె మొదటి నుంచి విధులను దైవంగా భావిస్తూ పనిచేస్తూ ఉంటారు. గతంలో విశాఖలోని ఉక్కు నిర్వాసిత ప్రాంతాల్లో డెంగీ జ్వరం విజృంభిస్తే అక్కడి పర్యటించి చర్యలు తీసుకున్నారు. తొందరగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 2013లో సివిల్స్‌కు సెలక్ట్‌ అయిన ఆమె మొదట విశాఖ జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

సృజన తండ్రి గుమ్మల్ల బలరామయ్య కూడా ఐఏఎస్‌ అధికారిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. కర్నూలు కలెక్టర్‌గా, కడప జాయింట్‌ కలెక్టర్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా, ఎండోమెంట్స్‌ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.