iDreamPost
android-app
ios-app

gurthunda seethakalam గుర్తుందా శీతాకాలం రిపోర్ట్

  • Published Dec 09, 2022 | 3:54 PM Updated Updated Dec 09, 2022 | 3:54 PM
gurthunda seethakalam గుర్తుందా శీతాకాలం రిపోర్ట్

నటుడిగా ఎంత టాలెంట్ ఉన్నా సోలో హీరోగా పెద్ద విజయం అందని ద్రాక్షగా మారిన సత్యదేవ్ కు ఇటీవలే గాడ్ ఫాదర్ లో చేసిన నెగటివ్ క్యారెక్టర్ చాలా పేరు తీసుకొచ్చింది. చిరంజీవికి ధీటుగా ఎదురు నిలబడి విలనిజం పండించడంలో మంచి ఈజ్ చూపించాడు. ఇవాళ రిలీజైన కొత్త సినిమా గుర్తుందా శీతాకాలంలో చాలా సాఫ్ట్ రోల్ చేశాడు. కన్నడలో పెద్ద హిట్ గా నిలబడిన లవ్ మాక్ టైల్ కు అఫీషియల్ రీమేకిది. పలు వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో మోక్షం దక్కించుకుంది. నాగ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ లవ్ డ్రామాకు లక్ష్మి భూపాల, కాల భైరవ లాంటి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

కథ కర్ణాటకలోని ఒక హిల్ స్టేషన్ నుంచి మొదలవుతుంది. దేవ్(సత్యదేవ్)కారులో బెంగళూరు వెళ్తూ దివ్య(మేఘా ఆకాష్)తో పరిచయం కలిగి ప్రయాణంలో ఆమెకు తన గతం చెప్పడం మొదలుపెడతాడు. టీనేజ్ లవ్ అమృత(కావ్య శెట్టి) తనకు డబ్బు లేని కారణంగా బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడం, ప్రేమించిన నిధి(తమన్నా)ని పెళ్లి చేసుకున్నాక అమ్ము తిరిగి తన లైఫ్ లో వచ్చేందుకు ప్రయత్నించడం ఇవన్నీ చెప్పుకుంటూ పోతాడు. అసలు ఈ ముగ్గురు అమ్మాయిలకు దేవ్ కు ఉన్న కామన్ కనెక్షన్ ఏంటి, చివరికి అతను ఎవరితో ఉండాల్సి వచ్చిందనేది స్క్రీన్ మీదే చూడాలి. ఒరిజినల్ వెర్షన్ కి పెద్దగా మార్పులు చేయకుండా అదే ఫార్మట్ ఫాలో అయ్యారు

ఫీల్ గుడ్ అంటే సాగదీసిన ఎమోషన్లు, స్లోగా ప్లే చేసే డ్రామా కాదు. ఎందుకంటే అంత ఓపిగ్గా వాటిని ఆస్వాదించే యూత్ ఇప్పుడు లేరు. నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమరీస్, ప్రేమమ్ లాంటి ఎన్నో చూసిన మనకు ఇందులో కొంచెం కూడా కొత్తదనం అనిపించదు. అక్కడక్కడా కొన్ని మంచి సీన్లు పడ్డా ఓవరాల్ గా బాగుందని చెప్పడానికి అవేమాత్రం సరిపోలేదు. పైగా సత్యదేవ్ కి ఈ పాత్ర అంతగా నప్పలేదు. కన్నడలో ఎందుకు ఆడిందో కాదు తెలుగులో మన ఆడియన్స్ కొత్తగా ఫీలవ్వడనికి ఏమున్నాయో చెక్ చేసుకుని ఉంటే బాగుండేది. సాంకేతిక వర్గం ఎంత కష్టపడినా అసలు మ్యాటర్ వీక్ గా ఉండటంతో శీతాకాలం ఏసిలోనూ చెమటలు పట్టించేంత బోరింగ్ గా సాగింది. విపరీతమైన ఓపిక ఉంటేనే ట్రై చేయొచ్చు.