iDreamPost
iDreamPost
ప్రేమోన్మాదంతో పెచ్చరిల్లుతున్న కిరాతకులకు తీవ్ర హెచ్చరిక లాంటి తీర్పును గుంటూరు ప్రత్యేక కోర్టు వెలువరించింది. సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టినా నిందితుడిలో ఇసుమంతైనా మార్పు రాలేదని, అతని మాటతీరు, వ్యవహారశైలి చూస్తే అతనిలో తప్పు చేశానన్న భావన కనిపించలేదని.. పశ్చాత్తాపం కూడా లేకపోగా విచారణ సమయంలోనే పారిపోవడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కేసును అరుదైన వాటిలో అరుదైనదిగా పరిగణించి విచారణ జరిపామన్నారు. సాక్ష్యాధారాలు, ఇతరత్రా సమాచారం పరిశీలించిన తర్వాత నిందితుడు నేరం చేశాడని నిర్ధారణ అయ్యిందని న్యాయమూర్తి వెల్లడించారు. నిందితుడిని మరణించే వరకు ఉరితీయాలని తీర్పు ఇచ్చారు.
ప్రేమ పేరుతో కిరాతకం
గుంటూరు నగరంలోని పరమయ్యకుంటకు చెందిన రమ్య బీటెక్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ ఫేస్ బుక్ ల ద్వారా ఆమెకు శశికృష్ణ పరిచయం అయ్యాడు. కొన్నాళ్లకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, ఫోన్ చేసి వేధించడం ప్రారంభించాడు. దాంతో రమ్య అతని ఫోన్ నంబరును బ్లాక్ చేసింది. దాంతో కక్ష పెంచుకున్న శశికృష్ణ గత ఏడాది ఆగష్టు 15న ఉదయం 9.30 గంటల సమయంలో నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే రమ్యపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. పొట్టలో 8 కత్తిపోట్లు కావడంతో ఆమె మృతి చెందింది.
దిశ చట్టంతో నిందితుడి ఆటకట్టు
రమ్య హత్య ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. అన్ని వర్గాలు నిరసనలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. దిశ చట్టం కింద కేసు దర్యాప్తు చేసి.. నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని ఆదేశించింది. ఆ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ కేసు దర్యాప్తును దిశ డీఎస్పీకి అప్పగించారు. సంఘటన స్థలం సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడు శశికృష్ణను గుర్తించి 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో మొత్తం 36 మందిని విచారించి 15 రోజుల్లోనే ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి ఈ నెల 26న విచారణ పూర్తిచేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ప్రకటించారు.