Idream media
Idream media
ఒక రాజు , ఇద్దరు భార్యలు, చిన్న భార్య తమ్ముడి పేరు వక్రకేతు, సేనాపతి పేరు దుష్టబుద్ధి. ఇది చాలదా సినిమా కథకి, పెద్ద భార్యకి కొడుకు పుడతాడు, అతని వల్ల తండ్రికి కళ్లు పోతాయని జోస్యులు చెబుతారు. అడవిలో వదిలేయమని రాజుగారి ఆజ్ఞ. బిడ్డని చంపేసి రమ్మని బామ్మర్ది హెచ్చరిక. చచ్చిపోతే సినిమాకి హీరో ఎలా? పెరిగి పెద్దాడై విలన్ల అంతు తేల్చాలి. అప్పుడే ప్రేక్షకులకి ఆనందం. ఈ లోగా మహారాజు కళ్లు పోగొడతాడు బామ్మర్ది. గుడ్డిరాజుని 20 ఏళ్లు సింహాసనం మీద దుష్ట బామ్మర్ది ఎందుకు కూర్చో పెడతాడు, సినిమా కాబట్టి తప్పదు. ఇదే లైఫ్‌లో అయితే 20 రోజులు కూడా ఓపిక పట్టరు. కళ్లు ఉన్న మహారాజులతోనే అధికారం లాక్కున్న అల్లుళ్లు ఉన్నారు. అదంతా మనకెందుకు? గులేబకావళి కథ సినిమా గురించి చెప్పుకుందాం.
ఇదే కథని తెలుగులో వందసార్లు తీశారు. గ్రాఫిక్స్‌ని పక్కన పెడితే బాహుబలి ఇదే. రాజ్యం కోసం కుట్ర. పిల్లవాన్ని శివగామి కాపాడుతుంది. ఎక్కడో పెరుగుతాడు. కోటకి చేరుకుని తల్లిని విడిపిస్తాడు. యుద్ధాలెన్ని జరిగినా మూల కథ ఇదే.
మన జానపద సినిమాలకి అసలు మూలం అరేబియన్ నైట్స్ కథలు. వాటి ఆధారమే తెలుగులో కాశీమజిలీ కథలు. 1938లో ఇదే పేరుతో సినిమా తీశారు. 1962లో NTR సొంత బానర్‌లో వచ్చింది. డైరెక్టర్ కూడా ఆయనే కానీ, టైటిల్స్‌లో పేరు ఉండదు. ఆ రోజుల్లో ఈ సినిమా పేరు నోరు తిరిగేది కాదు. గులాబికావాలి అని పలికేవాళ్లు. కథలో పెద్ద ట్విస్టులు లేకపోయినా స్క్రీన్‌ప్లే , డైలాగ్‌లు అద్భుతం. ప్రాసలతో హాస్యాన్ని జూనియర్ సముద్రాల సృష్టించారు. పొడవాటి డైలాగ్ ఒక్కటి కూడా వుండదు. డైరెక్టర్‌గా NTRది ఎంత సూక్ష్మ దృష్టి అంటే జూనియర్ ఆర్టిస్టుల Expression బాడీ లాంగ్వేజీ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. మహారాజుకి విషపాత్ర ఇస్తున్న చెలికత్తె షాకింగ్ Expression హైలెట్.
తమిళంలో 1955లో MGR తీస్తే అక్కడ హిట్. ఆ ప్రేరణతో NTR తెలుగులో తీస్తే ఇక్కడ సూపర్‌హిట్. 1962 సంక్రాంతికి ఈ సినిమా వేస్తే థియేటర్లన్నీ కళకళ. ఆ రోజుల్లో ఎడ్ల బండ్లపై చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చేవాళ్లు. పార్కింగ్‌కి స్థలం వుండేది కాదు. థియేటర్ పరిసర ప్రాంతాలన్నీ గడ్డిపోచలు, పేడ.
కారణం తెలియదు కానీ, జమునకి ఇద్దరు అగ్రహీరోలతో గొడవలు. దాంతో అక్కినేని , NTR ఇద్దరూ ఆమెతో నటించడం మానేశారు. విజయ వారు గుండమ్మకథ (1962) తీయాలనుకున్నారు. ANR కి జమున అయితేనే కరెక్ట్ అని నిర్మాత చక్రపాణి అభిప్రాయం. ముగ్గురిని ఒక రోజు ఆఫీస్‌కి పిలిపించాడు. చక్రవాణి అంతటి వాడు పిలిస్తే రాకుండా ఉంటారా? చక్రపాణి మంచి కాఫీ అందించాడు. ANR, NTR, జమునలని చూసి మీరు మా సినిమాలో కలిసి నటిస్తున్నారు. మీ వల్ల మా గుండమ్మ ఏడుస్తోంది అన్నాడు. రాజీ కుదిరింది.
ఆ విధంగా గులేబకావళి కథలో జమున వచ్చింది. రెండో హీరోయిన్ నాగరత్న. జి.వరలక్ష్మి మేనకోడలు. ఇదే మొదటి సినిమా. తర్వాత MGR తో ఒకటి రెండు సినిమాల్లో నటించి తెరమరుగైంది. ఈమెకి ఒక పాటతో పాటు ఒక డైలాగ్ వుంది. రెండుసార్లు నాన్నా అని మాత్రమే అంటుంది. ఒకే డైలాగ్‌తో హీరోయిన్‌గా పరిచయమైన తొలి నటి ఈవిడే వుంటుంది సినీ హిస్టరీలో.
ఇంకో విశేషం ఏమంటే డాక్టర్ సి.నారాయణరెడ్డి పాటల రచయితగా పరిచయం కావడం. ఆయన రాసిన అన్ని పాటలు హిట్. “నన్ను దోచుకుందువటే” ఆల్‌టైమ్ హిట్.
హీరో పార్వతిదేవి కటాక్షంతో జన్మించిన తర్వాత అతనికి ఏ కష్టాలు రావని తెలుసు. వచ్చినా జయిస్తాడని తెలుసు. ఎలా జయిస్తాడనేదే ఉత్కంఠ. అన్ని సినిమాల్లో హీరోనే గెలుస్తాడని మనకు తెలుసు. అయినా డబ్బులిచ్చి సినిమా చూస్తాం. జీవితంలో ఎలాగూ విలన్లే గెలుస్తారు. సినిమాల్లోనైనా హీరోలని గెలవనిద్దాం. రియల్ లైఫ్ విలన్ల గొప్పతనం ఏమంటే వాళ్లు కూడా సినిమాల్లో విలన్లు గెలిస్తే ఒప్పుకోరు. ఎవడి విలనీని వాడు గుర్తించలేడు.
సుదూరంగా ఎక్కడో జరిగే విషయాలని చూడాలని మనిషికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే మన ప్రాచీన కథల్లో , పాత సినిమాల్లో మాయా దర్పణం ఉంటుంది. అదే ఇప్పుడు వీడియో కాల్‌గా మారింది.
గులేబకావళి కథ ఒక క్లాసిక్. నారాయణరెడ్డిని పాటల రచయితగా, రవికాంత్ నగాయిచ్చు కెమెరా మెన్‌గా ఎక్కడికో తీసుకెళ్లింది. తొలిసారి సంగీత దర్శకత్వం వహించి హిట్ పాటలు అందించిన జోసఫ్, విజయా కృష్ణమూర్తికి మాత్రం కాలం కలిసి రాలేదు.
సినిమా వచ్చి 58 ఏళ్లు దాటాయి. ఒక్క హేమలత పండు ముదుసలిగా జీవిస్తూ వుంది. ఇంకెవరూ బతికి లేరు. వీళ్లందరినీ తిరిగి బతికించే గులేబకావళి పుష్పాన్ని ఇంకా ఎవరూ ప్రపంచంలో కనిపెట్టలేదు.