iDreamPost
android-app
ios-app

IPL 2022 : గెలుపు తీరాలని అందుకున్న గుజరాత్ టైటాన్స్.. మొదటి సీజన్లోనే కప్పు అందుకొని సరికొత్త రికార్డ్ ..

  • Published May 30, 2022 | 6:28 AM Updated Updated May 30, 2022 | 6:29 AM
IPL 2022 : గెలుపు తీరాలని అందుకున్న గుజరాత్ టైటాన్స్.. మొదటి సీజన్లోనే కప్పు అందుకొని సరికొత్త రికార్డ్ ..

IPL 2022 సీజన్ ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో ఎవరికీ అంచనాలు లేని కొత్త టీమ్స్ టేబుల్ టాప్ లోకి వెళ్లగా, టాప్ లో ఉంటాయి అనుకున్న టీమ్స్ అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఊహించని బ్యాటర్స్ దుమ్ము దులిపేసారు. ఎవరూ ఊహించని విధంగా రకరకాల ట్విస్టులతో ఈ సీజన్ సాగింది. ఇక మొదటిసారి వచ్చిన టీం గుజరాత్ టైటాన్స్ అనూహ్యంగా ఫైనల్ కి వెళ్ళింది. ఎప్పుడో మొదటి సీజన్లో కప్పు కొట్టిన రాజస్థాన్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఫైనల్ కి చేరింది.

గెలుపు అవకాశాలు రెండు జట్లకు సమంగా ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ మే 29న గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తలపడగా పెద్దగా హిట్టింగ్ లు, ట్విస్టులు, ఛేజింగ్ లు లేకుండానే తక్కువ స్కోర్స్ తోనే మ్యాచ్ జరిగి రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. లీగ్ లోకి అడుగు పెట్టిన తొలి సీజన్ లోనే కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది గుజరాత్ టైటాన్స్.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ సారి రాజస్థాన్ బ్యాటర్స్ అంతా విఫలమయ్యారు. జోస్ బట్లర్ తన బ్యాట్ ని ఝుళిపిస్తాడు అనుకున్నా 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ టీంలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. రాజస్తాన్ నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఈజీగానే చేధించింది. కేవలం 18.1 ఓవర్లలోనే 133 పరుగులు చేసి విజయం సాధించింది.

గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 45 పరుగులు చేయగా చివర్లో కెప్టెన్ హార్థిక్ పాండ్యా 34 పరుగులు చేసి గుజరాత్ కి విజయాన్ని అందించారు. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి గుజరాత్ టైటాన్స్ IPL 2022 కప్పు నెగ్గింది.