iDreamPost
android-app
ios-app

గుడియా అత్యాచార ఘటనలో ఈ నెల 30న శిక్షలు ఖరారు

గుడియా అత్యాచార ఘటనలో ఈ నెల 30న శిక్షలు ఖరారు

నిర్భయ ఉదంతం జరిగిన 4నెలల తరువాత మరో అత్యాచార ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మరోసారి ఢిల్లీని వార్తల్లో నిలిచేలా చేసిన ఆ అత్యాచార ఘటనలో తుది తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 30న వెలువరించనుండి.

వివరాల్లోకి వెళితే 2013లో ఢిల్లీలో ఐదేళ్ల గుడియాను పాశవికంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తమ చిన్నారి కనబడటం లేదని గుడియా తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేస్తే పోలీసులు నిర్లక్ష్యం వహించారని పలు ఆరోపణలు వచ్చాయి. కాగా చిన్నారి రెండు రోజుల తరువాత అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. మనోజ్ కుమార్, ప్రదీప్‌ అనే ఇద్దరు నిందితులు గుడియాపై సామూహిక అత్యాచారం చేసారని పోలీసుల విచారణలో తెలిసింది. కాగా ఈ దుర్ఘటనలో గుడియా ప్రైవేట్ భాగాల్లో కొవ్వొత్తులు, గాజు ముక్కలు చొప్పించినట్లు గుర్తించడంతో తీవ్ర కలకలం రేగింది.

ఈ ఘటనపై ఢిల్లీ కోర్టు నేడు తీర్పును వెలువరించింది. మనోజ్ కుమార్, ప్రదీప్‌లను దోషులుగా గుర్తించిన కోర్టు, ‘‘మన సమాజంలో వివిధ పండుగల సందర్భంగా మైనర్ బాలికలను దేవతలుగా కొలవడం జరుగుతుంది. కానీ ఈ కేసులో బాధిత బాలిక అత్యంత దుర్మార్గాన్ని, క్రూరత్వాన్ని అనుభవించిందని, బాధితురాలిని అత్యంత పాశవికంగా హింసించారనీ దీన్ని చూసి సభ్య సమాజం హృదయం కదిలిపోయిందని కోర్టు పేర్కొంది.గుడియాపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన ఇద్దరు నిందితులకు ఈ నెల 30 న శిక్షలు ఖరారు చేయనుంది.

కోర్టు వ్యాఖ్యలతో ఇద్దరు నిందితులకు కఠిన శిక్ష పడుతుందని పలువురు భావిస్తున్నారు. కానీ 2013 లో అత్యాచార ఘటన జరిగితే ఇన్నేళ్ల తరువాత కోర్టు శిక్ష ఖరారు చేయనుండడంతో పలువురు హర్షిస్తూనే న్యాయ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు.