iDreamPost
android-app
ios-app

భారత “ఉసేన్ బోల్ట్” శ్రీనివాస్ గౌడకి మహదవకాశం

భారత “ఉసేన్ బోల్ట్” శ్రీనివాస్ గౌడకి మహదవకాశం

కర్ణాటకలో జరిగిన కంబాలా పండుగ సందర్భంగా తన ఎద్దులతో కలిసి ప్రపంచ ఛాంపియన్ ఉసేన్ బోల్ట్ కన్నా వేగంగా పరుగెత్తిన మంగుళూరుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాస గౌడకు కేంద్ర మంత్రి కిరేన్ రిజిజు చొరవతో మహదవకాశం లభించింది.

దక్షిణ కర్ణాటక తీరప్రాంతమైన ఉడుపి, ఉత్తర కేరళ తీరప్రాంతమైన కాసరగోడ్ ని కలిపి తుళునాడు అని పిలుస్తారు. ఈ తుళునాడులో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రైతులకు పంట చేతికందాక జరుపుకునే ఉత్సవం కంబాలా పండుగ. ఎద్దులు కానీ దున్నపోతులు కానీ పరుగులు తీసే ఈ పోటీలో వాటితో కలిసి, అవి మరింత వేగంగా పరుగెత్తేలా అదిలిస్తూ, సరైన మార్గంలో పరుగెత్తిస్తూ కొందరు యువకులు కూడా వాటితో కలిసి పరుగెడుతారు.

అలా ఒక పందెంలో పరుగెత్తిన మంగుళూరుకు చెందిన యువకుడు శ్రీనివాస గౌడ. ఆ వీడియోలో వంద మీటర్లు పరుగెత్తడానికి శ్రీనివాస గౌడకు పట్టిన సమయం 9.55 సెకన్లు ప్రస్తుత వంద మీటర్ల పరుగులో తిరుగులేని ఛాంపియన్ ఉసేన్ బోల్ట్ రికార్డు అయిన 9.58 సెకన్లు కన్నా తక్కువ ఉండడం ఎవరో గమనించి సోషల్ మీడియాలో పోస్టు చేసి, ప్రభుత్వం చొరవ తీసుకుని అతనికి శిక్షణ ఇస్తే పరుగు పందెంలో ఛాంపియన్ గా తయారయ్యే అవకాశం ఉందని రాశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరేన్ రిజిజూ కంట పడింది. ఆయన ఆదేశాలతో అధికారులు శ్రీనివాస గౌడని వెతికి పట్టుకుని, బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ ఇప్పించే ప్రతిపాదన అతని ముందు పెట్టారు. దానికి ఆ యువకుడు అంగీకరించడంతో సోమవారం బెంగళూరు చేరుకునేలా ట్రెయిన్ టికెట్ బుక్ చేసి అతనికిచ్చి, బెంగళూరు స్పోర్ట్స్ అథారిటీలో వసతి, శిక్షణ ఏర్పాట్లు కూడా చేశారు.

శ్రీనివాస గౌడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశం గర్వించదగిన క్రీడాకారుడు అవుతాడని ఆశిద్దాం.